TRS: మాణికం.. మాటలు జాగ్రత్త.. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌కు ఎమ్మెల్సీ కవిత హెచ్చరిక

  • కేసీఆర్, జగన్, నవీన్ పట్నాయక్‌లను ఏటీఎంగా అభివర్ణించిన మాణికం ఠాగూర్
  • కేసీఆర్ అందరినీ మోసం చేయలేరని ట్వీట్
  • మాట్లాడేటప్పుడు పదాలను జాగ్రత్తగా ఎంచుకోవాలన్న కవిత
trs mlc kavitha warns congress leader manickam tagore

కేసీఆర్ అందరినీ మోసం చేయలేరంటూ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణికం ఠాగూర్ చేసిన ట్వీట్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏదైనా మాట్లాడేటప్పుడు పదాలను  జాగ్రత్తగా ఎంచుకోవాలని హెచ్చరించారు. మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో సదస్సు నిర్వహిస్తామన్న కేసీఆర్ ప్రకటనపై స్పందించిన మాణికం ఠాగూర్.. కేసీఆర్ అందరినీ మోసం చేయలేరన్నారు. మోదీకి, అమిత్‌షాకు అవసరమైనప్పుడు కేసీఆర్ సాయం చేస్తారని, ఇప్పుడు మోదీ, షాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతిపక్షాలను గందరగోళంలో పడేయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. కేసీఆర్, నవీన్ పట్నాయక్, జగన్‌మోహన్‌రెడ్డిలు ఏటీఎం (ఎనీటైమ్ మోదీ మద్దతుదారులు) అని తీవ్ర విమర్శలు చేశారు.

మాణికం ఠాగూర్ వ్యాఖ్యలపై కవిత తీవ్రంగా స్పందించారు. గత లోక్‌సభ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తుంటే కాంగ్రెస్ సభ్యులు తమతో కలిశారని గుర్తు చేశారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ మోదీకి వ్యతిరేకమైతే డిసెంబరులో కేసీఆర్ నిర్వహించే ప్రతిపక్షాల సమావేశానికి హాజరు కావాలని అన్నారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా పదాలను ఎంపిక చేసుకోవాలని హెచ్చరించారు. ఎన్నికల సంఘానికి లేఖ రాసి వరద బాధితులకు అందిస్తున్న పది వేల రూపాయల సాయాన్ని ఎందుకు అడ్డుకున్నారని మాణికం ఠాగూర్‌ను కవిత ప్రశ్నించారు.

More Telugu News