భారత సరిహద్దుల్లో భూటాన్ ను ఆక్రమించి... ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించిన చైనా!

20-11-2020 Fri 08:36
  • పంగ్డా పేరిట అన్ని సౌకర్యాలతో గ్రామం
  • డోక్లాంకు కేవలం 9 కిలోమీటర్ల దూరంలోనే
  • దుందుడుకు వైఖరిని ప్రదర్శిస్తున్న చైనా
China Develops a Village near Doklam

భూటాన్ పరిధిలోని 2 చదరపు కిలోమీటర్ల భూమిని ఆక్రమించిన చైనా, అక్కడో గ్రామాన్నే నిర్మించింది. సిక్కిం సమీపంలో ఇండియా, చైనా మధ్య గతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు సాక్షిగా నిలిచిన డోక్లాం ట్రై జంక్షన్ ఈ గ్రామం కేవలం 9 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం.

చైనా మీడియా ఈ కొత్త గ్రామం చిత్రాలను ప్రచురిస్తూ, ప్రత్యేక కథనాలను అందించింది. సరిహద్దుల్లో ఇది ఎంతో వ్యూహాత్మక ప్రదేశమని, ఇక్కడ ఇక శాశ్వత నివాసులు ఉండనున్నారని, వారి సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నాయి. ఇక ఈ కొత్త గ్రామం, అందుకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు భారత మీడియాలోనూ వచ్చాయి.

ఈ గ్రామానికి పంగ్డా అని చైనా పేరు పెట్టింది. ఈ గ్రామానికి అన్ని సౌకర్యాలూ కల్పించింది. ఇది యాడాంగ్ కౌంటీకి దక్షిణాన 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని వెల్లడిస్తూ, గ్రామం లొకేషన్ ను చైనా అధికారిక మీడియా తరఫున ట్వీట్ చేసిన జర్నలిస్ట్ ఆపై దాన్ని డిలీట్ చేసినప్పటికీ, అప్పటికే స్క్రీన్ షాట్స్ వైరల్ అయ్యాయి. చైనా నిర్మించిన ఈ గ్రామంపై భారత్ తక్షణం దృష్టిని సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తక్కువ ఆయుధ సంపత్తి ఉన్న భూటాన్ సార్వభౌమత్వాన్ని కాపాడే బాధ్యత కూడా ఇండియాపై ఉండటంతో, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, భారత్, చైనా మధ్య ఎన్నో దశాబ్దాల తరువాత డోక్లాం ప్రాంతంలో గొడవలు జరిగిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ తరువాత ఈ సంవత్సరం లడఖ్ రీజియన్లో జరిగిన గొడవల్లో 20 మంది భారత జవాన్లు అసువులు బాశారు. ఈ సమయంలో చైనా తన దుందుడుకు వైఖరిని ప్రదర్శిస్తూ, సరిహద్దుల్లో గ్రామాన్నే నిర్మించడం గమనార్హం.