ఇయర్ ఫోన్స్‌ అతిగా వాడుతున్నారా?.. మీకో హెచ్చరిక!

20-11-2020 Fri 07:54
  • రోజుకు 8 గంటలకుపైగా ఇయర్‌ఫోన్లు వాడుతున్న విద్యార్థులు, ఉద్యోగులు
  • మానకుంటే సమస్యలు శాశ్వతంగా మారే ప్రమాదం ఉందంటున్న నిపుణులు
  • ఇయర్ ఫోన్ల కారణంగా చెవులపై విపరీతమైన ఒత్తిడి
increased use of earphones causing ear infections

ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా ప్రపంచ స్థితిగతులను మార్చేసింది. వ్యాపార కార్యకలాపాల తీరుతెన్నులను సమూలంగా మార్చేసింది. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసుకునే వెసులుబాటు కల్పించగా, విద్యాసంస్థలు ఆన్‌లైన్ క్లాసులు చెబుతున్నాయి. ఫలితంగా ఇయర్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది.

దీంతో చాలామంది ఉద్యోగులు 8 గంటలకుపైగానే ఇయర్‌ఫోన్లు వాడుతున్నారు. ఫలితంగా వినికిడి సమస్యలు తలెత్తుతున్నట్టు తేలింది. దాదాపు 9 నెలలుగా విద్యార్థులు, ఉద్యోగులు ఇయర్ ఫోన్స్‌ను అతిగా వాడుతుండడంతో ఈ సమస్యలు వేధిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, వీటివల్ల చెవులకు ఇన్ఫెక్షన్ కూడా సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

వినికిడి సమస్యలతో తమ వద్దకు వచ్చే వారిలో చాలామందికి ఇయర్‌ఫోన్స్‌తో నేరుగా సంబంధం ఉందని ముంబైలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని జేజే ఆసుపత్రి  ఈఎన్‌టీ విభాగం హెడ్ డాక్టర్ శ్రీనివాస్ చవాన్ పేర్కొన్నారు. ఇప్పటికైనా వాటి వినియోగాన్ని తగ్గించకుంటే  సమస్యలు శాశ్వతంగా మారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చాలా మంది 8 గంటలకు పైగానే హెడ్‌ఫోన్లు ధరిస్తున్నారని, ఫలితంగా చెవులపై విపరీతమైన ఒత్తిడి పడుతోందని అన్నారు.

అలాగే, స్టెరిలైజ్ కాని ఇయర్ పాడ్స్, ఇయర్ ప్లగ్స్ కారణంగా చెవులకు ఇన్ఫెక్షన్ సోకుతుందని చెప్పుకొచ్చారు. అలాగే, చెవిలో పేరుకుపోయిన గులిమిని కాటన్ బడ్స్ ఉపయోగించి తీయడం ప్రమాదకరమని, గులిమి ఇన్ఫెక్షన్లు రాకుండా నివారిస్తుందని వివరించారు. అలాగే, ఇయర్‌ఫోన్లను తరచూ తీస్తూ తాజా గాలి చెవుల్లోకి వెళ్లేలా చూసుకోవాలని సూచించారు. స్కూలు పిల్లలు ఇయర్ ఫోన్స్‌కు దూరంగా ఉండడమే మంచిదని, ఇయర్ ఫోన్లకు బదులుగా సౌండ్ బార్లు ఉపయోగించడం అన్ని రకాలుగా మంచిదని ముంబైలోని సెయింట్ జార్జ్ ఆసుపత్రి ఈఎన్‌టీ హెడ్ డాక్టర్ రాహుల్ కులకర్ణి సూచించారు.