గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని సంస్థల్లో సీబీఐ సోదాలు

19-11-2020 Thu 21:09
  • మైనింగ్ వ్యవహారంలో సీబీఐ విచారణ
  • 25 చోట్ల సోదాలు
  • యరపతినేని సహా 22 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు
 CBI searches in belongings of former MLA Yarapathineni Srinivasarao

మైనింగ్ వ్యవహారాలకు సంబంధించి గురజాల మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావుకు చెందిన సంస్థల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. యరపతినేని అనుచరులకు సంబంధించిన సంస్థల్లోనూ సోదాలు జరిగాయి. డీఓపీటీ నోటిఫికేషన్ ప్రకారం యరపతినేనిపై కేసు నమోదు చేసిన సీబీఐ విచారణ చేపట్టింది.

గతంలో లైమ్ స్టోన్ మైనింగ్ వ్యవహారంలో సీబీసీఐడీ 17 మందిపై 17 కేసులు నమోదు చేసింది. 2014 నుంచి 2018 వరకు అక్రమ మైనింగ్ చేపట్టినట్టు పేర్కొంది.

ఈ నేపథ్యంలో మైనింగ్ వ్యవహారంలో తాము విచారణ చేస్తున్నట్టు సీబీఐ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. సీబీఐ... యరపతినేనికి సంబంధించి  గుంటూరు జిల్లాలోనూ, హైదరాబాద్ లోనూ 25 చోట్ల సోదాలు చేపట్టింది. యరపతినేని సహా మొత్తం 22 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వీరిలో ఆరుగురు యరపతినేనికి అత్యంత సన్నిహితులని తెలిపింది. మైనింగ్ కు సంబంధించి ఎంతమేర తవ్వకాలు జరిగాయో శాటిలైట్ ద్వారా గుర్తిస్తామని సీబీఐ వెల్లడించింది.

సోదాల సందర్భంగా సీబీఐ అధికారులు కీలక డాక్యుమెంట్లు, నగదు, మొబైల్  ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.15 లక్షల మేర నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.