బీజేపీలో చేరిన మరో టీఆర్ఎస్ కార్పొరేటర్

19-11-2020 Thu 20:58
  • దూకుడు పెంచిన బీజేపీ
  • బీజేపీలో చేరుతున్న టీఆర్ఎస్ నేతలు
  • కాషాయ కండువా కప్పుకున్న వెంగళరావునగర్ టీఆర్ఎస్ కార్పొరేటర్
TRS Corporator joins BJP

తెలంగాణలో బీజేపీ దూకుడుగా దూసుకుపోతోంది. మొన్నటి వరకు రాష్ట్రంలో మూడో స్థానానికే పరిమితమైన బీజేపీ... ఇప్పుడు అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతున్న నేపథ్యంలో... రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదిగేందుకు అడుగులు వేస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలో లభించిన విజయంతో రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ అమాంతం పెరిగింది.

బీజేపీలో చేరేందుకు టీఆర్ఎస్ నేతలు కూడా మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే మైలార్ దేవ్ పల్లికి చెందిన టీఆర్ఎస్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరారు. తాజాగా ఈరోజు మరో టీఆర్ఎస్ కార్పొరేటర్ కాషాయ కండువా కప్పుకున్నారు. వెంగళరావునగర్ టీఆర్ఎస్ కార్పొరేటర్ కిలారి మనోహర్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వెంగళరావు నగర్ బీజేపీ అభ్యర్థిగా ఆయనకే అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది.