భవిష్యత్తు మాదే... బీజేపీతో కలిసి ఏపీలో జెండా ఎగరేస్తాం: నాదెండ్ల మనోహర్

19-11-2020 Thu 20:07
  • విజయవాడలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం
  • పాల్గొన్న నాదెండ్ల మనోహర్
  • జగన్ సర్కారు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతామని వెల్లడి
Nadendla Manohar confident on win along with BJP in future

జనసేన పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ విజయవాడలో క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీతో కలిసి ఏపీలో జెండా ఎగరేసే విధంగా ఇకపై తమ కార్యాచరణ ఉండబోతోందని అన్నారు.

జగన్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్షేత్రస్థాయికి తీసుకెళ్లే విధంగా రెండు పార్టీలకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. ఏడాదిన్నర కాలంగా జగన్ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు అగచాట్ల పాలవుతున్నారని, ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళతామని వెల్లడించారు.

ఇక క్రియాశీలక సభ్యత్వాల గురించి చెబుతూ, పవన్ కల్యాణ్ పిలుపు మేరకు రాజకీయాల్లో మార్పు కోసం అహర్నిశలు కష్టిస్తున్న కార్యకర్తలకు ఇది సువర్ణావకాశమని నాదెండ్ల వివరించారు. ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు ఆశించకుండా పార్టీ కోసం కష్టించి పనిచేసే కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వం మంచి వేదిక అని స్పష్టం చేశారు.