Scott Morrison: మా జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా మా నిబంధనలు ఉంటాయి: చైనాకు తేల్చిచెప్పిన ఆస్ట్రేలియా ప్రధాని

  • చైనా, ఆస్ట్రేలియా మధ్య మాటలయుద్ధం
  • 14 కారణాలు ఏకరవుపెడుతూ జాబితా విడుదల చేసిన చైనా
  • ఇలాంటి ఒత్తిళ్లకు తాము తలొగ్గబోమన్న ఆస్ట్రేలియా ప్రధాని
 Australia PM Scott Morrison comments on China dossier

కొంతకాలంగా ఆస్ట్రేలియా, చైనా దేశాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆస్ట్రేలియాపై ఫిర్యాదులను ఏకరవుపెడుతూ చైనా విదేశాంగ శాఖ ఓ పట్టిక విడుదల చేసిన నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ స్పందించారు. చైనా ఒత్తిళ్లకు తాము తలొగ్గబోమని స్పష్టం చేశారు.

ఆస్ట్రేలియా ఇటీవల తమ విదేశీ పెట్టుబడుల విధానాన్ని మరింత కఠినతరం చేసింది. తమ 5జీ నెట్ వర్క్ ఏర్పాటు నుంచి చైనాకు చెందిన హువావే సంస్థను తప్పించింది. అంతేకాకుండా, జాతీయ భద్రత నేపథ్యంలో పలు ప్రాజెక్టుల్లో చైనా పెట్టుబడులను అడ్డుకుంది. దాంతో చైనా అధినాయకత్వం కంగారూ దేశంపై కారాలుమిరియాలు నూరుతోంది. 'మీరు చైనాను శత్రువు అనుకుంటే చైనా నిజంగానే శత్రువుగా మారుతుంది' అని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు తమ దౌత్యకార్యాలయం ద్వారా 14 ఆరోపణలతో ఓ జాబితాను విడుదల చేసింది.

దీనిపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ మాట్లాడుతూ, చైనా విదేశీ వ్యవహారాల శాఖ విడుదల చేసిన ఆ జాబితాను 'అనధికార పత్రం' అని పేర్కొన్నారు. ఇలాంటి ఫిర్యాదులు, ఆరోపణలతో ఆస్ట్రేలియాను అడ్డుకోలేరని అన్నారు. "మా జాతీయ ప్రయోజనాలే మాకు ముఖ్యం. మా జాతీయ ప్రయోజనాలు కాపాడుకునే విధంగా మా నిబంధనలు రూపొందించుకుంటాం" అని తేల్చిచెప్పారు.

"మా సొంత విదేశీ పెట్టుబడుల విధానం రూపకల్పనలోనూ, 5జీ నెట్ వర్క్ నిర్మాణం ఎలా చేయాలన్న దానిపైనా ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడేది లేదు. ఓ దేశంగా ఆస్ట్రేలియా ముందుకు వెళుతుంటే అడ్డుపడే శక్తుల నుంచి కాపాడుకునేందుకు వెనుకంజ వేసేది లేదు" అని వివరించారు.

More Telugu News