Ricky Ponting: కోహ్లీ లేకపోతే టీమిండియా ఆటగాళ్లు అదనపు ఒత్తిడికి గురవుతారు: రికీ పాంటింగ్

  • ఆస్ట్రేలియాతో 4 టెస్టులు ఆడనున్న భారత్
  • తొలి టెస్టు తర్వాత భారత్ తిరిగిరానున్న కోహ్లీ
  • నెం.4 స్థానంలో ఎవరు ఆడతారన్న పాంటింగ్
 Ricky Ponting opines on Virat Kohli absence in test series

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా జట్టుతో తొలి టెస్టు తర్వాత భారత్ తిరిగిరానున్న సంగతి తెలిసిందే. తన భార్య అనుష్క ప్రసవించనుండడంతో కోహ్లీకి బీసీసీఐ ప్రత్యేక అనుమతి మంజూరు చేసింది. కాగా, నాలుగు టెస్టుల సిరీస్ లో కోహ్లీ గైర్హాజరీలో మిగిలిన 3 టెస్టులకు వైస్ కెప్టెన్ అజింక్యా రహానే నాయకత్వం వహించే అవకాశాలున్నాయి.

అయితే, కోహ్లీ లేని లోటు భర్తీ చేయలేనిదని ఆసీస్ బ్యాటింగ్ దిగ్గజం రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ భారత్ కు వెళ్లిపోతే బ్యాటింగ్ ఆర్డర్ పరిస్థితి ఏంటన్నది టీమిండియా ఆటగాళ్ల మదిలో స్పష్టతలేదని అన్నాడు. కోహ్లీ లేకుండా ఆడే మూడు టెస్టుల్లో భారత ఆటగాళ్లు అదనపు ఒత్తిడికి గురవుతారని పేర్కొన్నాడు. కోహ్లీ బ్యాటింగ్, నాయకత్వం కోల్పోవడం ఆటగాళ్లను కుదుపుకు గురిచేస్తుందన్నాడు.

"కోహ్లీ లేకపోతే అజింక్యా రహానే కెప్టెన్సీ స్వీకరిస్తాడని భావిస్తుండొచ్చు కానీ, అది అతనిపై అదనపు భారం కలిగిస్తుంది. టెస్టుల్లో నిజంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న నెం.4 స్థానంలో ఆడే బ్యాట్స్ మన్ ఎవరో వాళ్లు వెతుక్కోవాలి. ఆ స్థానంలో ఎవరు ఆడాలన్నదానిపై వాళ్లలో నిశ్చితాభిప్రాయం ఉంటుందని నేననుకోను. అంతెందుకు, మొదటి టెస్టుకు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ఏంటో ఇప్పటికైనా వాళ్లకు అవగాహన ఉందా? ఎవరు ఓపెనర్లుగా దిగాలి? కోహ్లీ భారత్ వెళ్లిపోతే ఎవరు నెం.4లో రావాలి? అనేది తేల్చుకున్నారా?" అని ప్రశ్నించాడు.

ఆస్ట్రేలియా జట్టుకు కూడా ఇదే తరహాలో ప్రశ్నలు ఎదురవుతున్నాయని, వార్నర్ కు జతగా పుకోవ్ స్కీ, లేక, గ్రీన్ ఓపెనర్ గా బరిలో దిగుతాడా అనేది సందిగ్ధంగానే ఉందని అన్నాడు. భారత్ పై అంతకుమించి సందేహాలు ఉన్నాయని పాటింగ్ పేర్కొన్నాడు.

బుమ్రా, షమీ బౌలింగ్ దళంలో కచ్చితంగా ఉంటారనుకుంటే వాళ్లకు తోడుగా ఇషాంత్ ఉండొచ్చు లేక ఉమేశ్ యాదవ్ ఉండొచ్చు లేక కుర్రాళ్లవైపు మొగ్గుచూపితే సైనీ లేక సిరాజ్ ఉండొచ్చంటూ అనేక అభిప్రాయాలు వినిపిస్తున్నాయని, కానీ నిర్దిష్టమైన బౌలింగ్ కూర్పు అంటూ లేదని విమర్శించాడు. స్పిన్ విభాగంలోనూ ఎవర్ని తుది జట్టులోకి తీసుకోవాలన్నది టీమిండియాకు ఓ సమస్యేనని అన్నాడు.

More Telugu News