డీకే శివకుమార్ కుమార్తె నిశ్చితార్థానికి హాజరైన యడియూరప్ప

19-11-2020 Thu 17:20
  • అమర్త్యతో ఐశ్వర్య నిశ్చితార్థం
  • కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ కుమారుడే అమర్త్య
  • మాజీ సీఎం ఎస్ఎం కృష్ణకు మనవడు కూడా అవుతాడు
DK Shivakumars Daughter Engaged To Cafe Coffee Day Founders Son

కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్య నిశ్చితార్థం ఈరోజు వైభవంగా జరిగింది. కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్యతో నిశ్చితార్థం జరిగింది. పెళ్లికొడుకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణకు మనవడు అవుతాడు. నిశ్చితార్థ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప హాజరయ్యారు.

రాజకీయాలను, రాజకీయ వైరాలను పక్కనపెట్టి నిశ్చితార్థ వేడుకలో యడియూరప్ప, శివకుమార్ సంతోషంగా గడిపారు. మరోవైపు ఎస్ఎం కృష్ణతో కూడా యడియూరప్ప కాసేపు ముచ్చటించారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో కొనసాగిన ఎస్ఎం కృష్ణ 2017లో బీజేపీలో చేరారు.

శివకుమార్ కుమార్తె ఐశ్వర్య (24)ను గత సెప్టెంబర్ లో ఈడీ అధికారులు ప్రశ్నించారు. మనీ లాండరింగ్ కేసులో శివకుమార్ అరెస్ట్ అయిన సంగతి కూడా తెలిసిందే. అక్టోబర్ 23న శివకుమార్ కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ గా శివకుమార్ కు పేరుంది.