టీఆర్ఎస్ దండయాత్ర గాంధీనగర్ నుంచే ప్రారంభమవుతుంది: కవిత

19-11-2020 Thu 16:39
  • వరద బాధితులను జాతీయ పార్టీలు పట్టించుకోలేదు
  • ఓట్లు అడిగే హక్కు ఆ పార్టీలకు లేదు
  • గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుంది
TRS victory begins from Gandhinagar says Kavitha

కరోనా సమయంలో, వరదల సమయంలో హైదరాబాద్ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీనే అండగా ఉందని ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత అన్నారు. వరదల్లో నష్టపోయిన వారికి ప్రభుత్వం రూ. 10 వేల ఆర్థిక సాయం అందిస్తుంటే... బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయని మండిపడ్డారు. ప్రజల నోటికాడ ముద్దను లాక్కున్నారని విమర్శించారు.

వరదలు వచ్చినప్పుడు జాతీయ పార్టీలుగా చెప్పుకునే  బీజేపీ, కాంగ్రెస్ లు జనాలను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. వరద బాధితులకు కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అండగా నిలిచిందని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు లేదని అన్నారు. గాంధీనగర్ టీఆర్ఎస్ అభ్యర్థి అబిడ్స్ లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

మరోవైపు నామినేషన్ వేయడానికి ముందు గాంధీనగర్ లోని లక్ష్మీగణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె వెంట టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా పద్మనరేశ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, పలువురు టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, టీఆర్ఎస్ దండయాత్ర గాంధీనగర్ నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు.