ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కు 10 ఏళ్ల జైలు శిక్ష

19-11-2020 Thu 16:15
  • నిధుల కేసులో కోర్టు తీర్పు
  • నిషిద్ధ సంస్థ ఆస్తుల నిర్వహణ, నిధుల సేకరణపై ఆరోపణలు
  • అభియోగాలు నిరూపితమైన వైనం
Pakistan anti terrorism court has sentenced Hafiz Saeed and others

ముంబయి దాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా (జేయూడీ) ఉగ్రవాద భావజాల సంస్థ అధిపతి హఫీజ్ సయీద్ కు పాకిస్థాన్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. నిధులకు సంబంధించిన ఓ కేసులో తీవ్రవాద వ్యతిరేక న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. జైలు శిక్షతో పాటు 1,10,000 రూపాయల (పాకిస్థానీ రూపీ) జరిమానా విధించింది. ఈ కేసులో హఫీజ్ సయీద్ సన్నిహితుడు అబ్దుల్ రహమాన్ మక్కీకి కోర్టు ఆర్నెల్ల కారాగార శిక్ష విధించింది. కిందటి వారం జరిపిన విచారణలో జమాత్ ఉద్ దవాకు చెందిన మాలిక్ జాఫర్, యాహ్యా ముజాహిద్ లకు 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

2019లో నిధులకు సంబంధించిన ఆరోపణలపై కౌంటర్ టెర్రరిజం డిపార్ట్ మెంట్ (సీటీడీ) జమాత్ ఉద్ దవా నాయకులపై కేసులు నమోదు చేసింది. వీరిపై అభియోగాలు నిరూపితం కావడంతో కోర్టు శిక్షలు ప్రకటించింది. నిషిద్ధ సంస్థకు చెందిన ఆస్తుల నిర్వహణ, నిధుల సేకరణ ద్వారా ఉగ్రవాదానికి ఆర్థిక ఊతమిచ్చారంటూ వీరిపై సీటీడీ చార్జిషీటు దాఖలు చేసింది.