హైదరాబాదును ఎంఐఎంకి అప్పగించాలని అనుకుంటున్నారా?: కేసీఆర్ పై బండి సంజయ్ ఆగ్రహం

19-11-2020 Thu 14:39
  • బీజేపీని చూసి కేసీఆర్ భయపడుతున్నారు
  • ఢిల్లీలో కేసీఆర్ ను ఎవరూ పట్టించుకోరు
  • జనసేనతో పొత్తుకు సంబంధించి చర్చ జరగలేదు
KCR has links with terrorists says Bandi Sanjay

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దేశద్రోహి అని, ఆయనకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఎంఐఎం ఉగ్రవాద సంస్థ అని అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దారుణమని మండిపడ్డారు. చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని కాకుండా... మందు పే చర్చ కార్యక్రమాన్ని పెట్టమంటారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫొటో పెట్టి మందు పే చర్చ పెడదామని ఎద్దేవా చేశారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత కేసీఆర్ కు బార్లు, వైన్ షాపులే మిగులుతాయని అన్నారు.

దేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవాలని అనుకుంటున్నారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. హైదరాబాదును ఎంఐఎంకి అప్పగించాలని అనుకుంటున్నారా? అని నిలదీశారు. బీజేపీని చూసి కేసీఆర్ భయపడుతున్నారని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో గెలవగానే ఆ ఫ్రంటు, ఈ ఫ్రంటు అన్నారని... ఇప్పుడు ఆయనకు టెంటు కూడా లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి వెళ్తే కేసీఆర్ ను ఎవరూ పట్టించుకోరని అన్నారు. హిందూ దేవాలయాలపై దాడులు కేసీఆర్ కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే వరద బాధితులకు ఇంటికి రూ. 20 వేలు ఇస్తామని సంజయ్ హామీ ఇచ్చారు. పాడైపోయిన కార్లు, బైకులు ఇప్పిస్తామని తెలిపారు. జనసేనతో పొత్తుకు సంబంధించి చర్చ జరగలేదని చెప్పారు. జనసేనకు తాము ప్రతిపాదన పంపలేదని, వారు కూడా తమను అడగలేదని అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని... ఏ విషయం ఉన్నా ఫోన్ లో మాట్లాడుకుంటామని చెప్పారు. ఏపీలో మత మార్పిడిలను వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి పవన్ కల్యాణ్ అని ప్రశంసించారు.