బిగ్ బాస్... ఈ వారంలో మోనాల్ అవుట్... నాగార్జున కూడా కాపాడలేడంటున్న నెటిజన్లు!

19-11-2020 Thu 11:09
  • నిన్న మోనాల్ ప్రవర్తన అతిగా ఉందంటున్న నెటిజన్లు
  • ఈ వారంలో అతి తక్కువ ఓట్లను తెచ్చుకున్న మోనాల్
  • ఆదివారం జరగనున్న ఎలిమినేషన్ ఎపిసోడ్
This Week Monal Will Be eliminated from Biggboss

టాలీవుడ్ లో అతిపెద్ద రియాల్టీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ నాలుగో సీజన్ లో ఈ వారం హౌస్ నుంచి వెళ్లిపోయేది ఎవరో మూడు రోజుల ముందుగానే నెటిజన్లు తేల్చేశారు. ఈ వారం మోనాల్ వెళ్లిపోవాల్సిందేనని, ఆమెను నాగార్జున కూడా కాపాడలేడని అంటున్నారు.

బిగ్ బాస్ మూడవ వారంలోనే మోనాల్ ఎలిమినేట్ కావాల్సి వున్నా, హౌస్ లో గ్లామర్ ను నిలిపేందుకు ఆమెను కాపాడారని కామెంట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఆపై గత వారం వరకూ కూడా ఎలిమినేషన్ లో ఉన్నప్పుడల్లా, మోనాల్ కు అతితక్కువ ఓట్లు వస్తున్నాయని, అయినా బిగ్ బాస్ కాపాడుతూ వచ్చారని కూడా కామెంట్లు వచ్చాయి.

ఇక బిగ్ బాస్ తుది దశలోకి ప్రవేశించగా, ఈ వారంలో మోనాల్ వెళ్లిపోవాల్సిందేనని, అభిమానుల ఓట్లను బట్టే ఎలిమినేషన్ ఉంటుందని బిగ్ బాస్ ఎంతగా చెబుతున్నా, అది అవాస్తవమేనని నెట్టింట వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఇక గత రాత్రి హౌస్ లో జరిగిన ఘటనలు, మోనాల్ ప్రవర్తన వీక్షకులకు చాలా ఎబ్బెట్టుగా అనిపించిందని, ఈ ఉదయం నుంచి సోషల్ మీడియా కోడై కూస్తోంది. అఖిల్ తో ఆమె చేసిన రొమాన్స్, ఇచ్చిన ముద్దులు అతిగా ఉన్నాయని పలువురు అంటున్నారు.

ఇక పలు వెబ్ సైట్లు నిర్వహిస్తున్న ఓటింగ్ లోనూ మోనాల్ ఎలిమినేట్ కావాల్సిందేనని తమ అభిప్రాయాన్ని ప్రేక్షకులు కుండ బద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సైతం ఆమెకే తక్కువ ఓట్లు ఉన్నాయి. ఓటింగ్ లైన్స్ రేపటితో ముగియనుండగా, ఈలోగా ఆమె సేవ్ అయ్యేన్ని ఓట్లు వచ్చే అవకాశాలే లేవని, కాబట్టి మోనాల్ ఎలిమినేట్ అయి తీరుతుందని తెలుస్తోంది. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే, ఆదివారం రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్ వరకూ ఆగక తప్పదు.