ఉద్యోగుల కోసం ఇండియా వైపు చూస్తున్న బ్రిటన్ కంపెనీలు!

19-11-2020 Thu 09:20
  • తక్కువ వేతనాలకు లభించే ఉద్యోగుల వైపు మొగ్గు
  • చెన్నైలో కొత్త వారిని నియమించుకుంటున్న మెట్రో షిప్పింగ్
  • లండన్ లో ఒకరి బదులు ఇండియాలో ఏడుగురికి ఉద్యోగం
UK Companies Looking India for Employees

బ్రెగ్జిట్ తరువాత ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొని, సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఇండియా వంటి దేశాల నుంచి తక్కువ వేతనాలకు వచ్చే ఉద్యోగులు, కార్మికుల కోసం యూకే కంపెనీలు వేచి చూస్తున్నాయి. బ్రిటన్ లో నిపుణులైన కార్మికుల కొరత అధికంగా ఉండటంతో ఇండియా, రొమేనియా వంటి దేశాల్లో తమకు అవసరమైన పనులు చేసే లేబర్ ను నియమించుకోవాలని యూకే సంస్థలు భావిస్తున్నాయి.

అంతర్జాతీయ కంపెనీల నుంచి వచ్చే సరకును గమ్యానికి చేర్చే సేవలందిస్తున్న ఎక్స్ పీడియేటర్ పీఎల్సీ, ఇప్పటికే రొమేనియాలో కార్మికులను నియమించుకుంది. ఈ విషయాన్నిసంస్థ మార్కెటింగ్ మేనేజర్ డేవ్ గ్లాడెన్ స్వయంగా వెల్లడించారు. ఈ కార్మికులు తక్కువ వేతనాలకే లభిస్తున్నారని, యూకేలో కస్టమ్స్ క్లియరెన్స్ రిప్రజెంటేటివ్ లకు మరింతగా వేతనాలు చెల్లించాల్సి వస్తోందని ఆయన అన్నారు.

ప్రస్తుతం బ్రిటన్ లాజిస్టిక్స్ ఇండస్ట్రీ భవిష్యత్తు అయోమయంలో పడింది. ఈయూలో భాగంగా ఉన్నంతకాలం, పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కారణంగా వాణిజ్యానికి ఆటంకాలు లేకుండా పోయాయి. ఇప్పుడు ఈయూ నుంచి బయటకు వచ్చిన తరువాత, అన్ని విదేశీ కంపెనీలతో కొత్త డీల్స్ కుదుర్చుకోవాల్సి వుంది. సరిహద్దులు దాటే సరకుపై అదనంగా కస్టమ్స్ సుంకాలు చెల్లించాల్సి వుంది. ఈ అదనపు ఖర్చే సాలీనా 13 బిలియన్ పౌండ్ల వరకూ ఉంటుందని అంచనా.

బ్రిటన్ కు చెందిన అతిపెద్ద రీటెయిలర్లు, ఆటోమోటివ్ కంపెనీలకు వస్తువులను రవాణా చేసే మెట్రో షిప్పింగ్ లిమిటెడ్, ఇటీవల ఇండియాలోని చెన్నైలో 17 మంది ఉద్యోగులను నియమించుకుంది. వీరందరినీ ప్రస్తుతం బ్రెగ్జిట్ కు సంబంధించిన పనిపైనే ప్రత్యేకంగా నియమించారు. బర్మింగ్ హామ్ కు చెందిన ఈ సంస్థ సాలీనా 1,20,000 కస్టమ్స్ డిక్లరేషన్స్ ను క్లియర్ చేయాల్సి వుంటుంది.

ఈ నేపథ్యంలో కొత్త క్లయింట్లను స్వీకరించేందుకు కూడా బ్రిటన్ కంపెనీలు ఆసక్తిని చూపడం లేదు. ముందుగా ప్రస్తుతం ఉన్న డిమాండ్ ను అనుసరించి కస్టమ్స్ క్లియరింగ్స్ పై దృష్టిని సారించామని మెట్రో డెవలప్ మెంట్ డైరెక్టర్ గ్రాంట్ లైడెల్ వెల్లడించారు. యూకేలో ఒక్క ఉద్యోగిని తీసుకునే బదులుగా ఇండియాలో ఆరేడుగురు ఉద్యోగులను నియమించుకునే అవకాశాలు ఉన్నాయని, అందుకే, ఇక్కడి నుంచే తమకు కావాల్సిన వర్క్ చేయించుకుంటున్నామని ఆయన తెలిపారు.