బీజేపీ ఆడని అబద్ధం, చేయని అసత్య ప్రచారం ఉండదు, జాగ్రత్త: నేతలతో కేసీఆర్

18-11-2020 Wed 21:21
  • ప్రశాంతమైన హైదరాబాద్ కావాలో, అల్లర్ల హైదరాబాద్ కావాలో ప్రజలే నిర్ణయించుకుంటారు
  • పేదలకు చేస్తున్న సాయాన్ని బీజేపీ అడ్డుకుంది
  •  అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ నేతలకు దిశానిర్దేశం
KCR slams BJP Over GHMC Elections

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కీలక భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. వచ్చే నెలలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నూటికి నూరుశాతం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో 100 సీట్లను గెలుచుకుంటామన్న కేసీఆర్.. ప్రశాంతమైన హైదరాబాద్ కావాలో, అల్లర్ల హైదరాబాద్ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఈ ఆరేళ్లలో రూ. 67 వేల కోట్లతో అభివృద్ధి పనులు జరిగినట్టు చెప్పారు. బీజేపీ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు.

నగరంలోని వరద బాధితులందరికీ సాయం అందిస్తామని చెప్పారు. పేదలను బీజేపీ ఆదుకోకపోవడమే కాకుండా, తాము ఇస్తున్న వరద సాయాన్ని ఆపేయాలంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో బీజేపీ ఆడని ఆబద్ధం, చేయని దుష్ప్రచారం అంటూ లేదన్నారు. గ్రేటర్ ఎన్నికల్లోనూ బీజేపీ అదే చేస్తుందని, కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని నేతలకు కేసీఆర్ సూచించారు.