ప్రతిపక్షాలకు పేదల ఉసురు తగులుతుంది: మంత్రి తలసాని శాపనార్థాలు

18-11-2020 Wed 20:33
  • ఆదుకోవాలనుకుంటే అడ్డుకున్నారు
  • ఇప్పటి వరకు 1.65 లక్షల మందికి సాయం
  • గ్రేటర్ ఎన్నికల్లో 104కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తాం
Telangana minister Talasani fires on opposition parties

ప్రతిపక్షాలపై తెలంగాణ పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. పేదలకు పంపిణీ చేస్తున్న వరద సాయాన్ని అడ్డుకున్న వారికి పేదల ఉసురు తగిలి తీరుతుందని శాపనార్థాలు పెట్టారు.

అసలే కరోనా ఇబ్బందులు పడుతున్న పేదలకు, వరదలు మరింత కష్టాన్ని తెచ్చిపెట్టాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముంపు బాధిత కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారని అన్నారు. ఇప్పుడా సాయాన్ని అడ్డుకున్న ప్రతిపక్షాలకు పేదల ఉసురు తగులుతుందన్నారు.

కనీవినీ ఎరుగని వరదలతో నగరం అతలాకుతలం అయినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదన్నారు. పొరుగు రాష్ట్రాలు మాత్రం మనకు సాయం అందించాయని అన్నారు. కాగా, వరద సాయం కోసం ఇప్పటి వరకు 1.65 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, వారందరి బ్యాంకు ఖాతాల్లో రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని జమ చేసినట్టు చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, వాటిని చూపించే ఎన్నికలకు వెళ్తామన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో 104కు పైగా స్థానాల్లో గెలుస్తామని తలసాని ధీమా వ్యక్తం చేశారు.