Twitter: దిగొచ్చిన ట్విట్టర్.. భారత్‌కు క్షమాపణలు

  • లడఖ్‌ను చైనాలో భాగంగా చూపించిన ట్విట్టర్
  • కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన భారత్
  • లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పిన మైక్రోబ్లాగింగ్ సైట్
Twitter apologies India for hurting indian sentiments

మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ ఎట్టకేలకు దిగి వచ్చింది. లడఖ్‌ను  చైనాలో భాగంగా చూపించినందుకు క్షమాపణలు చెప్పింది. ఈ నెల 30 నాటికి తమ తప్పును సరిదిద్దుకుంటామని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (వ్యక్తిగత డేటా రక్షణ)కి వివరించింది.

లడఖ్‌ను చైనా భూభాగంగా చూపించినందుకు గాను ట్విట్టర్‌పై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్విట్టర్ తీరు దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను ప్రశ్నించేలా ఉందని, దీనిని దేశద్రోహంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో అమెరికాలోని ట్విట్టర్ ఐఎన్‌సీ అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

దీంతో దిగి వచ్చిన ట్విట్టర్ బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి నేతృత్వంలో ఏర్పాటైన జేపీసీ ముందు హాజరైన ట్విట్టర్ ప్రతినిధులు వివరణ ఇస్తూ క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా మీనాక్షి లేఖి మాట్లాడుతూ.. లడఖ్‌ను చైనాలో చూపించినందుకు ట్విట్టర్ లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పినట్టు తెలిపారు. భారత చిత్ర పటాన్ని తప్పుగా జియో ట్యాగింగ్ చేసినందుకు క్షమాపణ కోరుతూ ట్విట్టర్ ఇండియా మాతృసంస్థ ట్విట్టర్ ఐఎన్‌సీ చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ డమైన్ కరియన్ అఫిడవిట్ రూపంలో లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పినట్టు మీనాక్షి పేర్కొన్నారు. లడఖ్‌ను తప్పుగా ట్యాగ్ చేసి భారతీయుల మనోభావాలను గాయపరిచినందుకు క్షమాపణలు కోరారని, ఈ నెల 30 నాటికి తప్పును సరిదిద్దుకుంటామని హామీ ఇచ్చినట్టు వివరించారు.

More Telugu News