సాంకేతిక సమస్యతో నిలిచిపోయిన హైదరాబాద్ మెట్రో రైలు.. ప్రయాణికుల ఇబ్బందులు

18-11-2020 Wed 12:43
  • 20 నిమిషాల పాటు మార్గమధ్యంలో ఆగిపోయిన వైనం
  • ఎల్బీనగర్‌-మియాపూర్‌ మార్గంలో ఘటన  
  • మెట్రో సర్వీసుపై తీవ్ర విమర్శలు
again technical problems in metro rail

హైదరాబాద్‌లో ఓ మెట్రో రైలులో సాంకేతిక సమస్య తలెత్తడంతో దాదాపు 20 నిమిషాల పాటు మార్గమధ్యంలో ఆగిపోయింది. దీంతో అందులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎల్బీనగర్‌-మియాపూర్‌ మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కరోనా కారణంగా కొన్ని నెలల పాటు ఆగిపోయిన మెట్రో సర్వీసులకు ఇప్పుడిప్పుడే ప్రయాణికుల నుంచి మళ్లీ ఆదరణ పెరిగింది.

మెట్రో రైలులో సాంకేతిక సమస్య  తలెత్తడం ఇది మొదటిసారేం కాదు. గతంలోనే సాంకేతిక సమస్యల కారణంగా మెట్రోరైళ్లు అనేక సార్లు నిలిచిపోయాయి. జనవరిలో ఎల్బీనగర్- మియాపూర్‌ మార్గంలో రైలు పంజాగుట్ట మెట్రోస్టేషన్ వద్ద సాంకేతిక సమస్య తలెత్తి నిలిచిపోయింది. దీంతో అందులోంచి ప్రయాణికులను దింపేశారు. మెట్రో రైల్‌ సర్వీసులు ప్రారంభమై మూడేళ్లవుతున్నా ఇప్పటికీ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడం పట్ల విమర్శలు వస్తున్నాయి.