పెనుప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న ఖుష్బు

18-11-2020 Wed 11:58
  • కారులో వెళ్తున్న సమయంలో ప్రమాదం
  • కారు వెనుక డోరు భాగం నుజ్జునుజ్జు
  • బీజేపీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ప్రమాదం
khushboo meets with accident

బీజేపీ నాయకురాలు, సినీ నటి ఖుష్బూ కారులో వెళ్తున్న సమయంలో ఓ ట్యాంకర్ ఆమె వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. దీంతో కారు వెనుక సీటు డోరు భాగం నుజ్జునుజ్జయింది. ఆ సమయంలో ఆమె కారులో డ్రైవర్ పక్కన కూర్చుని ఉండడంతో త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.

బీజేపీ పార్టీ నేతలతో కలిసి విల్లుపురం జిల్లా మెల్మార్‌వతుర్ పట్ణణ సమీపంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆమెకు, కారు డ్రైవర్ కు ఎలాంటి గాయాలూ కాలేదు. ఎన్డీఏ సర్కారు పథకాలను తమిళనాడులో ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమంలో బీజేపీ ఈ నెల తేదీ నుంచి డిసెంబరు 6 వరకు వేల్‌ యాత్ర చేపట్టింది. ఇందులో భాగంగానే ఆమె బీజేపీ నేతలు, కార్యకర్తలతో కలిసి అందులో పాల్గొంటున్నారు. ఈ ప్రమాదం జరగడంతో ఆమె మరో వాహనంలో వెళ్లారు.

రోడ్డు ప్రమాదం నుంచి తనను మురుగన్ దేవుడే కాపాడారని ఖుష్బూ తెలిపారు. తాను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డానని చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ప్రమాదం అనంతరం తన ప్రయాణం కొనసాగిస్తున్నానని తెలిపారు. తనకు, తన భర్తకు మురుగన్ పై నమ్మకం ఉందని అన్నారు. కాగా, ఆమె కారును ట్యాంకర్‌ ఢీకొన్న ఘటనలో ఏమైనా కుట్ర కోణం ఉందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.