బీజేపీలో చేరాలంటూ ఆహ్వానం... ఆ ప్రసక్తే లేదన్న అళగిరి!

18-11-2020 Wed 11:46
  • అళగిరి వస్తే బీజేపీదే విజయమంటున్న పార్టీ నేతలు
  • బీజేపీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన అళగిరి
  • జనవరిలోపు రాజకీయ నిర్ణయం చెబుతానని వ్యాఖ్య
Azhagiri Clarifies that not to go with BJP

ఆరేళ్ల క్రితం డీఎంకే నుంచి డిస్మిస్ అయి, ఆపై రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన కరుణానిధి కుమారుడు అళగిరి, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నా సంగతి తెలిసిందే. ఆయన బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తే మనస్ఫూర్తిగా స్వాగతిస్తామని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్ వ్యాఖ్యానించారు. కొత్త రాజకీయ పార్టీపై అళగిరి ఇంతవరకూ నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ రాజకీయ పార్టీని ప్రారంభించకుంటే మాత్రం బీజేపీకి ఆహ్వానిస్తామని ఆయన అన్నారు.

ఇక ఈ వార్తలపై స్పందించిన అళగిరి, తాను బీజేపీలో చేరే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. మధురైలో మీడియాతో మాట్లాడుతూ, మురుగన్ తన సొంత అభిప్రాయాన్ని చెప్పి వుండవచ్చని అన్నారు. ఈ నెల 20న మద్దతుదారులతో జరపాల్సిన సమావేశాన్ని తాను వాయిదా వేశానని అన్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై జనవరిలోగా నిర్ణయం తీసుకుంటానని, ఆపై దాన్ని బహిరంగంగానే తెలియపరుస్తానని స్పష్టం చేశారు.

కాగా, బీజేపీ మాత్రం అళగిరిపై ఆశలు పెంచుకుంటోంది. స్టాలిన్ కన్నా అళగిరి రాజకీయ అనుభవం అధికంగా కలిగివున్న నేతంటూ బీజేపీ కార్యదర్శి శ్రీనివాసన్ పొగడ్తల వర్షం కురిపించారు. అపర చాణక్యుని వంటి అళగిరి బీజేపీలో చేరితే, రాష్ట్రంలో బీజేపీదే అధికారమని అన్నారు. 21న చెన్నైకి రానున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ జిల్లా కార్యదర్శులను కలిసి మాట్లాడనున్నారని, ఆ తరువాత రాష్ట్ర రాజకీయాలు సమూలంగా మారిపోతాయని, బీజేపీ మరింత బలపడుతుందని అన్నారు.