Ladakh: 'భారత జవాన్లపై చైనా మైక్రోవేవ్ వెపన్స్'... తప్పుడు సమాచారమన్న ఇండియా!

  • హిమాలయాల్లో కొండల కోసం మైక్రోవేవ్ తరంగాలు
  • చైనా ప్రొఫెసర్ చెప్పారంటూ సంచలన కథనం
  • ఫేక్ న్యూసంటూ కొట్టి పారేసిన సైన్యం
China Using Microwave Wepons is Fake News

లడఖ్ లోని సరిహద్దు ప్రాంతాల్లో భారత జవాన్లపై చైనా మైక్రోవేవ్ వెపన్స్ ప్రయోగించిందని చైనాకు చెందిన ఓ ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపగా, భారత అధికారులు, అది తప్పుడు సమాచారమని, అటువంటిదేమీ జరగలేదని తేల్చి చెప్పారు. మైక్రోవేవ్ వెపన్స్ వాడారని వచ్చిన వార్తను 'ఫేక్ న్యూస్'గా కొట్టి పడేశారు. హిమాలయాల్లోని రెండు కీలక పోస్టులను స్వాధీనం చేసుకునేందుకు చైనా ఈ ఎత్తు వేసిందని ఆ దేశానికి చెందిన ఓ ప్రొఫెసర్ పేర్కొన్నట్టు 'వాషింగ్టన్ ఎగ్జామినర్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే.

హిమాలయాల్లో భారత భూభాగమంతా మన అధీనంలోనే ఉందని ఆర్మీ ఓ ప్రకటనలో పేర్కొంది. మీడియాలో వచ్చినట్టుగా అటువంటి ఘటనలేవీ లడఖ్ లో జరగలేదని చెబుతూ, భారత ఆర్మీ ఏడీజీ పీఐ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

కాగా, "హిమాలయాల్లోని ఎత్తయిన ప్రాంతాల్లోకి మైక్రోవేవ్ తరంగాలను చైనా వదిలింది. అక్కడికి వెళ్లిన భారత జవాన్లు వెంటనే వాంతులు చేసుకున్నారు. ఆ ప్రాంతంలో నిలవలేకపోయారు. దీంతో ఆ ప్రాంతాలు తిరిగి చైనా అధీనంలోకి వెళ్లాయి" అని రెన్ మిన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జిన్ కాన్రాంగ్ వ్యాఖ్యానించినట్టు 'వాషింగ్టన్ ఎగ్జామినర్' పేర్కొంది.

ఈ ఘటన ఆగస్టు 29న జరిగిందని ఆయన వెల్లడించగా, అటువంటిదేమీ జరగలేదని సైన్యం స్పష్టం చేసింది. "వారు ఎత్తయిన పర్వత ప్రాంతాలను ఆక్రమించివుంటే, ఎందుకు ఇంకా భారత జవాన్లను అక్కడి నుంచి వెళ్లిపోవాలని చైనా కోరుతోంది? మన జవాన్లు, ట్యాంకర్లు, ఇతర అధునాతన ఆయుధాలు ఆ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ జవాన్లు కిందకు దిగిరారు" అని సైన్యాధికారి ఒకరు తెలిపారు.

More Telugu News