సినీ రంగంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను!: హీరోయిన్ తాప్సీ

18-11-2020 Wed 10:22
  • అందంగా లేనని అవమానాలు
  • సినీ హీరోల భార్యలు నన్ను ఇష్టపడేవారు కాదు
  • నా స్థానంలో ఇతర హీరోయిన్లకు అవకాశం ఇప్పించేవారు
  • నిర్మాతలు కూడా తీసుకొనేవారు కాదు 
tapsee about her career beginning

హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ తాను సినీరంగ ప్రవేశం చేసినప్పుడు ఎదుర్కొన్న అవమానాల గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అందం విషయంలో తాను ఇండస్ట్రీలో అనేకసార్లు అవమానాలు ఎదుర్కొన్నానని, తాను అందంగా లేనని కొంతమంది సినీ హీరోల భార్యలు తనను ఇష్టపడేవారు కాదని తెలిపింది.

ఎందుకంటే వారు తమ భర్త పక్కన అందంగా లేని తనలాంటి అమ్మాయి హీరోయిన్‌గా కనిపించడాన్ని సిగ్గుచేటుగా భావించేవారని చెప్పింది. దీంతో వారు తన స్థానంలో తమ భర్తల పక్కన ఇతర హీరోయిన్లకు అవకాశం ఇప్పించేవారని చెప్పుకొచ్చింది.

అంతేగాక, ఇదే కారణంతో కొందరు నిర్మాతలు కూడా తనను హీరోయిన్‌గా తీసుకోకపోయేవారని చెప్పింది. అప్పట్లో తాను నటించిన ఓ సినిమాలో హీరో ఇంట్రడక్షన్‌ సీన్ కంటే తన ఇంట్రడక్షన్‌ సీన్‌  బాగా వచ్చిందని ఆమె తెలిపింది. దీంతో తన కంటే హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ బాగుందన్న ఇగోతో దర్శకుడికి చెప్పి ఆ హీరో తన సీన్‌ను మార్చేశాడని ఆమె వాపోయింది. తనకు తెలియకుండా తనకు వ్యతిరేకంగా ఇంకా ఎన్ని జరిగాయోనని వ్యాఖ్యానించింది.