గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం

18-11-2020 Wed 10:14
  • కంటైనర్‌ను ఢీకొన్ని లారీ
  • మరో 17 మందికి తీవ్ర గాయాలు
  • ప్రమాదంపై ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తీవ్ర దిగ్భ్రాంతి
10 Killed and 16 Injured In Truck Accident Near Vadodara

గుజరాత్‌లోని వడోదర సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పదిమంది దుర్మరణం పాలయ్యారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. సూరత్ నుంచి పావగఢ్‌కు వెళ్తున్న లారీ వడదోర శివారులో వాగోడియా క్రాస్‌రోడ్డు సమీపంలోని వంతెనపై కంటైనర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో 10 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. వీరంతా సూరత్‌కు చెందినవారని, పంచమహల్ జిల్లాకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

ప్రమాదం కారణంగా రహదారిపై ట్రాఫిక్ స్తంభించి పోయింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాల్సిందిగా అధికారులకు సూచించారు.