రెండేళ్లలో 100 స్మార్ట్ నగరాల్లో 1000 కిలోమీటర్లు తిరిగేలా మెట్రో రైళ్లు: నరేంద్ర మోదీ

18-11-2020 Wed 09:36
  • బ్లూమ్ బర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్ లో మాట్లాడిన మోదీ
  • పెట్టుబడులకు అద్భుత అవకాశాలు అందిస్తున్న ఇండియా
  • కరోనా మహమ్మారితో ప్రపంచం ముందు ఎన్నో సవాళ్లు
  • అభివృద్ధి దిశగా తిరిగి నడవాల్సిన సమయం వచ్చిందన్న మోదీ
Modi Says India has Huge Opportunities in New Investments

ఇండియాలోని పట్టణ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచ ఇన్వెస్టర్లకు భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బ్లూమ్ బర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్, 3వ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, కరోనా మహమ్మారి కారణంగా ఆగిన ఆర్థిక వ్యవస్థ, తిరిగి ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందని ఆయన గుర్తు చేశారు. 2022 నాటికి 100 స్మార్ట్ నగరాల్లో 1000 కిలోమీటర్ల మెట్రో రైల్ సర్వీసులు రానున్నాయని మోదీ వెల్లడించారు.

"మీరు పట్టణ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తుంటే, ఇండియాలో అద్భుతమైన అవకాశాలు సిద్ధంగా ఉన్నాయి. వినూత్న ప్రాజెక్టులు మీ కోసం వేచి చూస్తున్నాయి. వ్యాపారవేత్తలకు స్నేహపూర్వక వాతావరణం, అతిపెద్ద మార్కెట్ ఇండియా సొంతం. ఇప్పటికే ప్రపంచ పెట్టుబడులకు ఇండియా స్వర్గధామంగా ఉంది. ఎంతో మంది ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు" అని మోదీ తెలిపారు.

కరోనా మహమ్మారి ఎన్నో సవాళ్లను ప్రపంచం ముందు ఉంచిందని వ్యాఖ్యానించిన నరేంద్ర మోదీ, అభివృద్ధికి దిశను చూపించే నగరాలు, పట్టణాలు సైతం కరోనా ప్రభావానికి లోనయ్యాయి. కరోనా తరువాత మనం తిరిగి నిలదొక్కుకోవాల్సిన పరిస్థితి. మన మైండ్ సెట్ ను మార్చుకోకుంటే ఆర్థిక వ్యవస్థను రీస్టార్ట్ చేయడం సాధ్యం కాదని అన్నారు.

ప్రతి రంగంలోనూ అభివృద్ధి కోసం కొత్త మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడిందని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఇండియాలో చౌక ధరల్లో గృహావసరాలను తీర్చేలా రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చామని, 27 నగరాల్లో మెట్రో రైళ్లు ఉన్నాయని, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాలతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. 100 స్మార్ట్ నగరాలను రెండు దశల్లో అభివృద్ధి చేసేందుకు రూ.2 లక్షల కోట్లను కేటాయించామని, ఇప్పటికే రూ. 1.40 లక్షల కోట్ల విలువైన పనులు పూర్తి కావడమో లేదా, ముగింపు దశలోనో ఉన్నాయని మోదీ తెలియజేశారు.