ఎల్‌బీ నగర్ బ్రిడ్జిపై ఘోర ప్రమాదం.. కారు ఢీకొనడంతో బ్రిడ్జిపై నుంచి కిందపడి యువకుడి మృతి

18-11-2020 Wed 09:05
  • 20 అడుగుల ఎత్తయిన బ్రిడ్జిపై నుంచి కిందపడిన యువకుడు
  • బైక్‌పై సంఘీ టెంపుల్‌కు వెళ్తుండగా ఘటన
  • తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు
One killed in Road accident at LB Nagar

హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఫతేనగర్‌కు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బ్రిడ్జిపై వేగంగా దూసుకొచ్చిన కారు యువకుడి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో అతడు 20 అడుగుల ఎత్తైన బ్రిడ్జిపై నుంచి కిందపడి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఫతేనగర్‌కు చెందిన ఉదయ్‌రాజ్ (18) తన బంధువు అయిన అనూషకు డిగ్రీ పరీక్షలు ఉండడంతో పరీక్ష కేంద్రం వద్ద వదిలిపెట్టాడు. పరీక్ష అనంతరం సంఘీ టెంపుల్‌ను దర్శించుకునేందుకు బైక్‌పై బయలుదేరారు.

ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటలకు ఎల్‌బీనగర్ బ్రిడ్జిపై వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్ డ్రైవ్ చేస్తున్న ఉదయ్‌రాజ్ అమాంతం గాల్లోకి ఎగిరి 20 అడుగుల ఎత్తైన బ్రిడ్జి పైనుంచి కింద పడ్డాడు. తీవ్రగాయాలపాలైన అతడిని స్థానికులు సమీపంలోని ఆరెంజ్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు తెలిపారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనూష అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, కారు మరో బైక్‌ను కూడా ఢీకొట్టడంతో దానిపై ఉన్న ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. వారిని కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.