భారత్ లో జరగాల్సిన అండర్-17 వరల్డ్ కప్ ను రద్దు చేసిన ఫీఫా!

18-11-2020 Wed 08:31
  • నవంబర్ 2 నుంచి జరగాల్సిన పోటీలు
  • తొలుత ఫిబ్రవరికి వాయిదా
  • ఆపై పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటన
  • 2022లో పోటీలకు ఆతిథ్యమిచ్చే అవకాశం ఇండియాకే
FIFA Cancells Under 17 World Cup Football Tourney in India

ఈ సంవత్సరం ఇండియాలో జరగాల్సిన అండర్-17 బాలికల ఫుట్ బాల్ వరల్డ్ కప్ ను రద్దు చేస్తున్నట్టు ఫీఫా ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా తొలుత 2021లో పోటీలను జరిపిస్తామని చెప్పిన ఫీఫా, అది కూడా సాధ్యం కాకపోవచ్చన్న ఆలోచనలో పోటీలను పూర్తిగా రద్దు చేస్తున్నామని వెల్లడించింది. ఇదే సమయంలో 2022 పోటీలను జరిపే అవకాశం ఇండియాకు ఇస్తున్నామని స్పష్టం చేసింది. తాజాగా సమావేశమైన ఫీఫా కౌన్సిల్, ప్రపంచంలో కొవిడ్-19 కేసులు పెరుగుతున్న పరిస్థితులను సమీక్షించి, ఈ నిర్ణయం తీసుకుంది.

అండర్-17తో పాటు కోస్టారికాలో జరగాల్సిన అండర్-20 బాలికల వరల్డ్ కప్ ను కూడా రద్దు చేస్తున్నామని, 2022లో కోస్టారికాలోనే ఈ పోటీలు జరుగుతాయని ఫీఫా ఓ ప్రకటనలో తెలిపింది. "ఈ టోర్నమెంట్ లను మరింతగా వాయిదా వేయడానికి వీల్లేదు. అందువల్ల 2020 ఎడిషన్ ను రద్దు చేస్తున్నాం. సభ్య దేశాలన్నీ ఇదే కోరుకున్నాయి. 2020లో పోటీలకు ఆతిథ్యమిచ్చే దేశాలకే, తదుపరి ఎడిషన్ పోటీలను జరిపేందుకు అవకాశం ఇస్తున్నాం" అని వెల్లడించింది.

వాస్తవానికి ఈ పోటీలు ఇండియాలోని ఐదు నగరాల్లోని మైదానాల్లో నవంబర్ 2 నుంచి 21 వరకూ జరగాల్సి వుండగా, వాటిని ఫిబ్రవరి 17 నుంచి మార్చి 7కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే, కాన్ఫెడరేషన్స్ ఆఫ్ ఆఫ్రికా, నార్త్ అండ్ సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా తదితరాలు ఇప్పటికీ క్వాలిఫయింగ్ టోర్నీలను నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలోనూ పోటీల నిర్వహణ సాధ్యం కాదన్న నిర్ణయానికి ఫీఫా వచ్చింది.