లక్ష్మీవిలాస్ బ్యాంకుపై రిజర్వు బ్యాంకు తాత్కాలిక మారటోరియం.. నగదు ఉపసంహరణ రూ. 25 వేలకు పరిమితం

18-11-2020 Wed 07:58
  • మూడేళ్లుగా దిగజారుతున్న బ్యాంకు ఆర్థిక పరిస్థితి
  • డిసెంబరు 16 వరకు అమల్లో మారటోరియం
  • 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న ఎల్‌వీబీ
RBI placed maratorium on Laxmi Vilas Bank

నష్టాల్లో కూరుకుపోయిన ప్రైవేటు రంగ బ్యాంకింగ్ సంస్థ లక్ష్మీవిలాస్ బ్యాంక్ (ఎల్‌వీబీ)పై భారతీయ రిజర్వు బ్యాంకు తాత్కాలిక మారటోరియం విధించింది. నిన్నటి నుంచి వచ్చే నెల 16 వరకు ఇది అమల్లో ఉంటుంది. ఈ కాలంలో ఖాతాదారులు 25 వేల రూపాయలకు మించి నగదును విత్‌డ్రా చేసుకోకుండా ఆంక్షలు విధించింది. అయితే, అత్యవసరాల విషయంలో మాత్రం కొంత మినహాయింపు ఇచ్చింది. అంటే ఆరోగ్యపరమైన ఖర్చులు, ఉన్నత విద్యకు సంబంధించిన ఫీజులు, వివాహ ఖర్చులు వంటి వాటి కోసం రిజర్వు బ్యాంకు అనుమతితో రూ. 25 వేలకు మించి నగదును ఉపసంహరించుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది.

బ్యాంకు పరిస్థితి గత మూడేళ్లుగా క్రమంగా దిగజారుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న డీబీఎస్ బ్యాంకులో లక్ష్మీవిలాస్ బ్యాంకు విలీనానికి సంబంధించిన ముసాయిదా పథకాన్ని కూడా ఆర్‌బీఐ వెల్లడించింది. ఈ డీల్‌కు గ్రీన్ సిగ్నల్ లభిస్తే ఎల్‌వీబీ డిపాజిటర్లు, ఖాతాదారులు, ఉద్యోగులకు కొంత ఊరట లభిస్తుంది.

1926లో వీఎస్ఎణ్ రామలింగ చెట్టియార్ నేతృత్వంలో ఏడుగురు వ్యాపారవేత్తలు కలిసి లక్ష్మీవిలాస్ బ్యాంకును ప్రారంభించారు. గతేడాది జూన్ 30 నాటికి దేశవ్యాప్తంగా 569 బ్రాంచీలు, 1,047 ఏటీఎంలు ఉన్నాయి. మొత్తం 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో బ్యాంకు సేవలు అందిస్తోంది. 4 వేల మందికిపైగా ఉద్యోగులున్నారు. ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి బ్యాంకు వ్యాపారం రూ. 37,595 కోట్లు కాగా, రూ. 397 కోట్ల నికర నష్టం చవిచూసింది.