Nellore District: ఆసుపత్రికి వెళ్లి అదృశ్యమైన ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు.. మిస్టరీగా మారిన వైనం!

  • నెల్లూరు జిల్లా జీకేపల్లిలో ఘటన
  • ఆరు బృందాలతో గాలిస్తున్న పోలీసులు
  • వారెక్కిన ఆటో గ్రామానికి చెందినది కాదంటున్న స్థానికులు

ముగ్గురు చిన్నారులతో కలిసి ఆసుపత్రికని వెళ్లిన ఇద్దరు మహిళలు అదృశ్యమైన ఘటన నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలంలోని జీకేపల్లి గ్రామంలో జరిగింది. ఆసుపత్రికి వెళ్లిన వారు రాత్రి పొద్దుపోయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో వీరి అదృశ్యం మిస్టరీగా మారింది.

పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కృష్ణయ్య, సుధాకర్ అన్నదమ్ములు. కృష్ణయ్యకు భార్య విజయ (26), కుమార్తెలు శ్రీవేణి (3), దివ్యశ్రీ (ఏడు నెలలు) ఉన్నారు. సుధాకర్‌కు భార్య సుప్రియ (25), రెండేళ్ల కుమార్తె సురేఖ ఉన్నారు. ఏడు నెలల చిన్నారి దివ్యశ్రీకి అనారోగ్యంగా ఉండడంతో విజయ, సుప్రియలు పిల్లలను తీసుకుని సోమవారం మధ్యాహ్నం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు.

అయితే, అక్కడ నెబ్యులైజర్ సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తామని చెప్పి అక్కడి నుంచి ఆటోలో బయలుదేరి వెళ్లారు. అలా వెళ్లిన వారు రాత్రయినా ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్థానికంగా వెతికినా ఫలితం లేకపోవడంతో సోమవారం అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొత్తం ఆరు బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. వీరు తమ వెంట ఫోన్లు కూడా తీసుకెళ్లలేదని, ఇతర ఆధారాల కోసం వెతుకుతున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, పీహెచ్‌సీ వద్ద మహిళలు ఎక్కిన ఆటో గ్రామానికి చెందినది కాదని స్థానికులు తెలిపారు.

More Telugu News