బీజేపీకి కేంద్ర మాజీ మంత్రి గైక్వాడ్ రాజీనామా

18-11-2020 Wed 00:50
  • పని చేసేవారు బీజేపీకి అవసరం లేదని మండిపాటు 
  • బాధ్యతలు ఇవ్వాలని అడుగుతున్నా అవకాశం ఇవ్వలేదు
  • అందుకే రాజీనామా చేశానన్న జైసింగ్ గైక్వాడ్
Former Union Minister Gaikwad resigns from BJP

బీజేపీకి ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైసింగ్ రావ్ గైక్వాడ్ పాటిల్ షాకిచ్చారు. పార్టీకి రాజీనామా చేశారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ కు తన రాజీనామా లేఖను పంపించారు. పార్టీ కోసం పని చేసేవారు బీజేపీకి అవసరం లేదని... పార్టీ అభివృద్ధి కోసం పని చేసే అవకాశాన్ని తనకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఈ కారణం వల్లే పార్టీకి తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు.

పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తన రాజకీయ జీవితంలో కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా పని చేశానని... మళ్లీ ఎమ్మెల్యేనో, ఎంపీనో కావాలనే కోరిక తనకు లేదని గైక్వాడ్ చెప్పారు. తన రాజకీయ అనుభవాన్ని పార్టీ అభివృద్ధి కోసం వినియోగించాలనుకున్నానని... బాధ్యతలను అప్పగించాలని పదేళ్లుగా అడుగుతున్నా అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పారు.