రాసిపెట్టుకోండి.. మూడేళ్ల తర్వాత వైసీపీ ఉండదు: విష్ణుకుమార్ రాజు

18-11-2020 Wed 00:38
  • నేను చెప్పినట్టే టీడీపీ ఓడిపోయింది  
  • జగన్ పాలనపై జనాలు విసిగిపోయారు
  • విశాఖలో అరాచకం పెరిగిపోయింది  
BJP

మరో మూడు సంవత్సరాల తర్వాత వైసీపీ ఉండదని బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఉండదంటే పార్టీని మూసేస్తారని కాదని, ఆ పార్టీ అధికారంలో ఉండదని అర్థమని అన్నారు. జరగబోయేది తాను చెపుతున్నానని... కావాలంటే రాసిపెట్టుకోవాలని చెప్పారు. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని తాను ముందే చెప్పానని... తాను చెప్పినట్టే జరిగిందని అన్నారు.

ఇప్పుడు తాను చెపుతున్నది కూడా జరిగి తీరుతుందని వ్యాఖ్యానించారు. వాస్తవాలనే తాను చెపుతానని, నోటికొచ్చింది చెప్పడానికి తాను కేఏ పాల్ కాదని అన్నారు. ఏడాదిన్నరలోనే జగన్ పాలనపై ప్రజలు విసిగిపోయారని విష్ణు కుమార్ రాజు చెప్పారు. ఎన్నికల సమయంలో జగన్ ముద్దులు పెడితే అది నిజమైన ప్రేమ అని జనాలు అనుకున్నారని... కానీ అది కపట ప్రేమ అనే విషయం ఇప్పుడు అందరికీ అర్థమైందని అన్నారు.

విశాఖలో అరాచకం పెరిగిపోయిందని విష్ణు దుయ్యబట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని, లోపల వేస్తున్నారని విమర్శించారు. అక్రమ కట్టడాల పేరుతో శుక్రవారం రాత్రి నుంచి కూల్చివేతలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. శని, ఆదివారాలు కూడా కోర్టులు పని చేసేలా చూడాలని... లేకపోతే జనాలకు న్యాయం జరగదని చెప్పారు. విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని అన్నారు. లేనిపక్షంలో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉందని చెప్పారు.