భార్య అదృశ్యమైన మూడు దశాబ్దాల తర్వాత తానే చంపానని అంగీకరించిన భర్త

17-11-2020 Tue 18:26
  • భార్యను, ప్రియురాలిని ఒకే తరహాలో చంపిన వ్యక్తి
  • ప్రియురాలి కేసు విచారిస్తుండగా భార్యను చంపిన వైనం బట్టబయలు
  • 40 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం
Husband agrees he had killed his wife

అమెరికాలో ఓ వ్యక్తి తన భార్యను చంపి ఆ నేరాన్ని మూడు దశాబ్దాల తర్వాత అంగీకరించిన వైనం వెల్లడైంది. జన్మతః ప్యూర్టోరికో జాతీయుడైన రోడ్రిగ్వెజ్ క్రజ్, మార్టా భార్యాభర్తలు. రోడ్రిగ్వెజ్ ఓ మాజీ మిలిటరీ పోలీసు అధికారి కాగా, మార్టా ఓ నర్సు. వీరు అమెరికాలోని ఆర్లింగ్టన్ కౌంటీలో నివసించేవారు. రోడ్రిగ్వెజ్ సైన్యం నుంచి రిటైరయ్యాక ఓ క్లినిక్ లో క్లర్కుగా చేరాడు.

అయితే మార్టా 1989 మే 25 తర్వాత అదృశ్యమైంది. మిస్సింగ్ కేసుల జాబితాలో ఆమె ఉదంతం కూడా చేరిపోయిందే తప్ప ఆచూకీ తెలియరాలేదు. ఇక, మార్టా అదృశ్యం తర్వాత  ఆమె భర్త రోడ్రిగ్వెజ్ డీసీ ప్రాంతానికి చెందిన మరో మహిళకు దగ్గరయ్యాడు. ఆమె పేరు పమేలా బట్లర్. పర్యావరణ పరిరక్షణ సంస్థలో ఆమె కంప్యూటర్ స్పెషలిస్ట్. ఆశ్చర్యకరంగా ఆమె కూడా 2009లో కనిపించకుండా పోయింది.

అయితే ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్న డీసీ పోలీసులు రోడ్రిగ్వెజ్ ను 2017లో అరెస్ట్ చేశారు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి నిజం కక్కేశాడు. బట్లర్ ను తానే గొంతు నులిమి చంపానని చెప్పాడు. అయితే, మృతదేహాన్ని ఎక్కడ పారేశావని పోలీసులు అడగ్గా, స్టాఫోర్డ్ లోని నెం.95 అంతర్రాష్ట్ర రహదారికి సమీపంలో అని జవాబిచ్చాడు.

దాంతో పోలీసులు అతను చెప్పిన ప్రదేశానికి వెళ్లగా అక్కడ అప్పటికే భవన నిర్మాణం జరుగుతోంది. దాంతో పమేలా బట్లర్ అవశేషాలు చెదిరిపోయాయి. అయితే ఇక్కడే ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో డీసీ పోలీసులకు సహకరిస్తున్న వర్జీనియా రాష్ట్ర పోలీసులు ఆసక్తికర సమాచారం అందించారు.

సరిగ్గా ఇదే ప్రాంతంలో 1991లో కూడా ఓ మృతదేహం అవశేషాలు లభించాయని చెప్పారు. ప్రస్తుతం ఆ అవశేషాలు స్టోరేజ్ లో భద్రపరిచినట్టు తెలిపారు. దాంతో పోలీసులు ఆ అవశేషాలకు డీఎన్ఏ టెస్టులు చేయగా, అవి గతంలో కనిపించకుండా పోయిన మార్టా రోడ్రిగ్వెజ్ కు సంబంధించినవని తేలింది. దాంతో రోడ్రిగ్వెజ్ కు తన నేరాన్ని అంగీకరించక తప్పింది కాదు. ఇక ఈ కేసుల్లో రోడ్రిగ్వెజ్ కు 40 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది.