కాళికా మాత పూజా కార్యక్రమానికి హాజరైన బంగ్లా స్టార్ క్రికెటర్ కు బెదిరింపులు.. క్షమాపణలు చెప్పుకున్న క్రికెటర్!

17-11-2020 Tue 17:51
  • వివాదంలో చిక్కుకున్న బంగ్లాదేశ్ ఆల్ రౌండర్
  • కోల్ కతాలో హిందూ ఈవెంట్ కు వచ్చిన షకీబ్
  • ఇస్లాంకు విరుద్ధమంటూ ఛాందసవాదుల ఆగ్రహం
Bangladesh all rounder Shakib Al Hasan apologize

బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ అనూహ్యరీతిలో వివాదంలో చిక్కుకున్నాడు. కోల్ కతాలో ఇటీవల నిర్వహించిన కాళికా మాత పూజా కార్యక్రమానికి షకీబ్ కూడా విచ్చేశాడు. అయితే, పరాయి మతం కార్యక్రమానికి వెళతావా? అంటూ ముస్లిం ఛాందసవాద సంస్థల నుంచి అతడికి బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో షకీబ్ క్షమాపణలు కోరాడు.

ఇటీవల ఫ్రాన్స్ పత్రిక మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర కార్టూన్లు ప్రచురించిందంటూ ఆగ్రహావేశాలమీదున్న ఇస్లామిక్ వాదులు షకీబ్ భారత్ లో మతపరమైన కార్యక్రమంలో దర్శనమివ్వడంతో మండిపడ్డారు. అయితే, తన చర్యపై షకీబ్ వివరణ ఇచ్చాడు. తాను ఆ వేదికపై ఉన్నది కేవలం రెండు నిమిషాలేనని, కానీ జనాలు మాత్రం ఆ కార్యక్రమాన్ని తానే ప్రారంభోత్సవం చేశానని అనుకుంటున్నారని అన్నాడు.

అయితే తానో ముస్లింనని, అలా ఎందుకు చేస్తానని, ఎప్పటికీ చేయనని అన్నాడు. కోల్ కతా వెళ్లకుండా ఉంటే బాగుండేదని, అందుకే క్షమాపణలు చెప్పుకుంటున్నానని షకీబ్ అల్ హసన్ పేర్కొన్నాడు. ఓ సంప్రదాయ ముస్లింగా తాను ఇస్లాంకు చెందిన అన్నిరకాల ఆచారాలు పాటించేందుకు ప్రయత్నిస్తానని, ఒకవేళ ఏదైనా తప్పుచేసి ఉంటే నన్ను మన్నించండి అని వివరించాడు.

కాగా, షకీబ్ పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విధించిన ఏడాది నిషేధం పూర్తయింది. బుకీలు తనను సంప్రదించినా, ఆ సమాచారాన్ని అధికారులకు తెలియజేయకపోవడంతో షకీబ్ పై బోర్డు నిషేధం విధించింది.