సినిమా కోసం... గుర్రపు స్వారీ నేర్చుకున్న ముద్దుగుమ్మ!

17-11-2020 Tue 16:55
  • మణిరత్నం దర్శకత్వంలో 'పొన్నియన్ సెల్వన్'
  • నాటి చోళుల పాలన నేపథ్యంలో సాగే సినిమా
  • రాణి కుందవై పాత్రలో నటిస్తున్న త్రిష
  • సినిమాలో త్రిష గుర్రపు స్వారీ చేసే సన్నివేశాలు
Trisha learned horse riding for a film

మన తారలు ఒక్కోసారి కొన్ని పాత్రల కోసం ఎంతో శ్రమిస్తూవుంటారు. ఆ పాత్ర పోషణలో తమదైన ప్రత్యేకతను చూపించుకోవడం కోసం ఒక్కోసారి కాస్త రిస్క్ కూడా తీసుకుంటూ వుంటారు. ఈ విషయంలో అప్పుడప్పుడు హీరోయిన్లు కూడా ముందుంటుంటారు. ప్రస్తుతం ప్రముఖ కథానాయిక త్రిష కూడా ఓ పాత్ర పోషణ కోసం అలాంటి కష్టాన్నే పడుతోంది.

ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో 'పొన్నియన్ సెల్వన్' అనే చారిత్రాత్మక కథా చిత్రం రూపొందుతోంది. చోళుల పాలన నేపథ్యంలో కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష 'రాణి కుందవై' పాత్రను పోషిస్తోంది. ఈ పాత్ర గుర్రం మీద స్వారీ చేసే సన్నివేశాలు కూడా చిత్రంలో ఉంటాయి. దాంతో త్రిష గుర్రపు స్వారీ నేర్చుకోవాలని నిర్ణయించుకుంది.

ఈ క్రమంలో చెన్నైలోని హార్స్ రైడింగ్ స్కూలులో జాయిన్ అయింది. తొలి ఐదు రోజుల్లో ముందుగా 'ఇంట్రో టు హార్స్ బ్యాక్ రైడింగ్' కోర్సును పూర్తిచేసింది. తర్వాత ఈ నెల 3 నుంచి ఫౌండేషన్ కోర్సు మొదలుపెట్టి, పది రోజుల్లో దానిని సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసింది. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ కూడా తనకు అందిందని త్రిష ఆనందంగా చెబుతోంది. ఇప్పుడు అమ్మడు గుర్రం మీద మంచి స్పీడుతో దౌడు తీయగలదన్నమాట!