పంజాబ్ రాష్ట్ర ఐకాన్ గా సోనూ సూద్... ఎన్నికల కమిషన్ నిర్ణయం

17-11-2020 Tue 13:59
  • రియల్ హీరోకు ఇది తగిన గౌరవం అని పేర్కొన్న ఈసీ
  • లాక్ డౌన్ వేళ ఆపన్న హస్తం అందించిన సోనూ
  • వేలమందిని స్వస్థలాలకు చేర్చిన వైనం
Sonu Sood appointed as Punjab state icon

సినిమాల్లో ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించే నటుడు సోనూ సూద్ మనసెంత మంచిదో ఈ లాక్ డౌన్ కాలంలో దేశవ్యాప్తంగా అందరికీ తెలిసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో, వ్యవస్థలన్నీ స్తంభించిన సమయంలోనూ సొంత ఖర్చులతో వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చడమే కాదు, విదేశాల్లో ఉన్న వారినీ భారత్ తీసుకువచ్చిన సోనూ సూద్ ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశారు.

సోనూ సూద్ సేవలకు గుర్తింపుగా పంజాబ్ ఎన్నికల సంఘం ఆయనను రాష్ట్ర ఐకాన్ గా నియమించింది. ప్రజలతో రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్ కు ఇది తగిన గౌరవం అని ఈసీ పేర్కొంది. సోనూ సూద్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని తెలిసిందే. పంజాబ్ లోని మోగా ఆయన స్వస్థలం.

కాగా, సోనూ సూద్ జీవితప్రస్థానంపై పెంగ్విన్ ఇండియా రాండమ్ హౌస్ ఆటో బయోగ్రఫీ విడుదల చేస్తోంది. దీనికి మీనా అయ్యర్ సహరచయిత. ఈ పుస్తకం పేరు 'అయాం నో మెస్సయా' (నేను రక్షకుడ్ని కాదు). వచ్చే నెలలో విడుదల కానున్న ఈ పుస్తకం ప్రజాదరణ పొందుతుందని భావిస్తున్నారు.