'ఏడేళ్ల క్రితం వారు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారు' అంటూ ఓ వీడియో పోస్ట్ చేసిన సచిన్

17-11-2020 Tue 13:29
  • మాజీ క్రికెటర్లు లారా,  క్రిస్‌ గేల్‌ ఈ డ్రమ్ ఇచ్చారు
  • క్రికెట్‌కు వీడ్కోలు పలికి నిన్నటితో ఏడేళ్లు
  • వారి ప్రేమ, గౌరవాలకు ధన్యవాదాలు  
sachin posts a video

మాజీ క్రికెటర్లు లారా,  క్రిస్‌ గేల్‌ తనకి గతంలో ఇచ్చిన డ్రమ్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్‌ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆయన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి నిన్నటితో ఏడేళ్లు పూర్తయ్యాయి. 2013, నవంబర్ 16న  ఆయన క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు.

తాను క్రికెట్ కి గుడ్ బై చెబుతోన్న సందర్భంగా  వెస్టిండీస్ క్రికెట్, లారా, క్రిస్ గేల్ కలసి ఆ డ్రమ్ ను తనకు ఇచ్చారని సచిన్ ట్విట్టర్ లో తెలిపారు. ఇటువంటి మంచి గిఫ్ట్ ఇచ్చిన వెస్టిండీస్‌ క్రికెట్‌ పట్ల తాను ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటానని చెప్పారు. వారి ప్రేమ, గౌరవాలకు ధన్యవాదాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఓ సారి తన ఇంటికి వచ్చిన లారా ఆ డ్రమ్‌ను వాయించడం తనకు గుర్తుందని, అదో అద్భుత అనుభవమని అన్నారు. ప్రస్తుతం తాను కూడా వాయించడానికి కాస్త ప్రయత్నిస్తున్నానని, అయితే, ఆ స్థాయిలో మాత్రం సౌండ్ రావట్లేదని తెలిపారు.