కాంగ్రెస్‌ను వెంటాడుతున్న బీహార్ ఓటమి.. తమిళనాడు ఎన్నికల్లో ఈసారి తక్కువ సీట్లనే కేటాయించనున్న డీఎంకే?

17-11-2020 Tue 10:05
  • తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు
  • ఇప్పటి నుంచే సీట్ల సర్దుబాటుపై డీఎంకే కుస్తీ
  • కూటమి మిత్రులకు ఈసారి గతం కంటే తక్కువ సీట్లే కేటాయించాలని నిర్ణయం
DMK decided to allocate 27 seats to congress coming assembly elections

బీహార్ ఎన్నికల్లో దారుణ ఓటమి కాంగ్రెస్‌ను వెంటాడుతోంది. కాంగ్రెస్‌తో కలిసి వెళ్తే తమకూ పరాభవం తప్పదని భావిస్తున్న పార్టీలు దానికి దూరంగా జరుగుతున్నాయి. తమిళనాడులోనూ ఇప్పుడా పార్టీకి ఎదురుగాలి వీస్తోంది.

వచ్చే ఏడాది ఇక్కడ శాసనసభ ఎన్నికలు జరగనుండగా, తమ కూటమిలో ఉన్న కాంగ్రెస్‌కు 27 స్థానాలు మాత్రమే కేటాయించాలని డీఎంకే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 సీట్లు కేటాయిస్తే 8 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అదే సమయంలో డీఎంకే 89 స్థానాలలో గెలిచి అధికారాన్ని మాత్రం పొందలేకపోయింది. ఆ తర్వాత లోక్ సభ ఎన్నికలలో మాత్రం డీఎంకే 38 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది.

ఫలితంగా ఈసారి కాంగ్రెస్ సహా కూటమిలోని పార్టీలకు ఆచితూచి సీట్లు కేటాయించాలని డీఎంకే యోచిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా, ఆలోగానే సీట్ల సర్దుబాటును పూర్తి చేయాలని భావిస్తోంది. అయితే, కాంగ్రెస్ మాత్రం తమకు 50కిపైగా స్థానాలు కేటాయించాలని డీఎంకేపై ఒత్తిడి తెస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచి ఎలాగైనా అధికారం చేపట్టాలని యోచిస్తున్న డీఎంకే మాత్రం ఈసారి కాంగ్రెస్‌ను 27 స్థానాలకే పరిమితం చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం.