మీరు సహకరించకుంటే మరింతమంది ప్రాణాలు కోల్పోతారు: ట్రంప్‌ను కోరిన బైడెన్

17-11-2020 Tue 09:40
  • అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించేందుకు ఇష్టపడని ట్రంప్
  • జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్న బైడెన్
  • అప్పటి వరకు వేచి చూస్తే ప్రమాదమన్న కాబోయే అధ్యక్షుడు
Coordinate with us before more people will die biden asked trump

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అప్పటి వరకు వేచి చూస్తే కరోనా మహమ్మారిని అరికట్టేందుకు సమయం మించిపోతుందని, కాబట్టి తన బృందంతో సహకరించాలని అధ్యక్షుడు ట్రంప్‌ను బైడెన్ కోరారు. వ్యాక్సిన్ ప్రణాళికలు, జాతీయ భద్రత, విధాన పరమైన సమస్యల్ని అధికార బదిలీ కోసం ఏర్పాటు చేసిన తన బృందంతో కలిసి పంచుకోవాలని, లేదంటే కరోనా కారణంగా మరింతమంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు.

టీకా పంపిణీ అనేది ఇప్పుడు చాలా కీలకమైన అంశమని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా తమతో సహకరించాలని ట్రంప్‌ను అభ్యర్థించారు. అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ ఓటమిని అంగీకరించేందుకు ట్రంప్ ఇష్టపడడం లేదు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, నిజానికి తానే గెలిచానని ట్రంప్ ప్రతి రోజూ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ తొలిసారి ట్రంప్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.