బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ చిత్రానికి 'సాహో' దర్శకుడు!

17-11-2020 Tue 09:12
  • ప్రస్తుతం 'అల్లుడు అదుర్స్' సినిమాలో బెల్లంకొండ 
  • 'ఛత్రపతి' సినిమా రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ
  • దర్శకుడిగా 'సాహో' ఫేమ్ సుజీత్ ఎంపిక    
Sujith to direct Bellamkonda

అనతికాలంలోనే తెలుగులో మంచి యాక్షన్ హీరోగా పేరుతెచ్చుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడిగా చిత్ర రంగ ప్రవేశం చేసినా, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం 'అల్లుడు అదుర్స్'  సినిమాలో నటిస్తున్న ఈ యువ కథానాయకుడు బాలీవుడ్ మీద దృష్టి పెట్టాడు. అక్కడ కూడా తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న శ్రీనివాస్ బాలీవుడ్ అరంగేట్రంకి సిద్ధమవుతున్నాడు.

ఈ క్రమంలో గతంలో ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఛత్రపతి' హిట్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ప్రభాస్ ని యాక్షన్ హీరోగా ఓ మెట్టు పైకి ఎక్కించిన 'ఛత్రపతి' చిత్రం బాలీవుడ్ లో తనకి మంచి గుర్తింపును ఇస్తుందని శ్రీనివాస్ భావిస్తున్నాడు.

ఇక ఈ చిత్రానికి సుజీత్ ని దర్శకుడిగా ఎంచుకున్నట్టు తాజా సమాచారం. ప్రభాస్ హీరోగా వచ్చిన 'సాహో' చిత్రానికి దర్శకత్వం వహించిన సుజీత్ ఆ చిత్రంతో బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో అతనైతే ఈ ప్రాజక్టుకు హైప్ వస్తుందని ఆయనను ఎంచుకున్నట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.