బెంగళూరు అల్లర్ల కేసు.. కాంగ్రెస్ మాజీ మేయర్ సంపత్ రాజ్ అరెస్ట్

17-11-2020 Tue 08:53
  • బెంగళూరు అల్లర్లలో నలుగురు మృతి
  • ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి పరారీలో ఉన్న కాంగ్రెస్ కార్పొరేటర్
  • బెంగళూరులో అదుపులోకి
Ex Congress Mayor R Sampath Raj Arrested in Bengaluru violence case

బెంగళూరు అల్లర్ల కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మేయర్ ఆర్ సంపత్‌రాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దేవర జీవన్‌హళ్లి మునిసిపల్ వార్డు కాంగ్రెస్ కార్పొరేటర్ అయిన సంపత్‌ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. అల్లర్ల కేసును దర్యాప్తు చేస్తున్న బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు సంపత్ రాజ్ సహా 60 మందిని నిందితులుగా పేర్కొంటూ చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. కాంగ్రెస్‌ కార్పొరేటర్లు అయిన సంపత్, అబ్దుల్ రకీబ్ జకీర్‌లపై పోలీసులు గతంలో నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు.

అదే సమయంలో సంపత్‌కు కొవిడ్ సోకడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. కొవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన తర్వాతి నుంచి సంపత్ పరారీలో ఉన్నారు. సంపత్‌, జకీర్‌లు పరారు కావడానికి సాయపడిన సంపత్ అనుచరుడు రియాజుద్దీన్‌ను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. మైసూర్‌లోని నాగర్‌హోల్‌లో వారికి అతడు ఆశ్రయం కల్పించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

ఆగస్టు 11న పులకేశినగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్ అఖండ శ్రీనివాసమూర్తి, ఆయన సోదరి ఇంటిపై దాదాపు 4 వేల మంది దాడికి దిగి విధ్వంసం సృష్టించారు. శ్రీనివాసమూర్తి మేనల్లుడు చేసిన సోషల్ మీడియా పోస్టులపై ఆగ్రహంతో వీరు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే ఇంటిని తగలబెట్టారు. అంతేకాదు, ఎమ్మెల్యే మేనల్లుడు అక్కడ ఉన్నాడన్న ఉద్దేశంతో దేవర జీవన్‌హళ్లి, కడుగొండనహళ్లి పోలీస్ స్టేషన్‌లను తగలబెట్టారు. ఈ అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, మరో వ్యక్తి అల్లర్లలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో సంపత్ రాజ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు.