Parliament: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు లేనట్టే!

  • గత పార్లమెంట్ సమావేశాల్లో విజృంభించిన కరోనా
  • ఆరు నెలల్లోగా సమావేశాలు జరిపితే సరిపోతుంది
  • ఇక నేరుగా బడ్జెట్ సమావేశాలేనన్న కేంద్ర మంత్రి
No Parliament Winter Season

ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరిపే పరిస్థితులు లేవని, సమావేశాలు జరుపుదామని ఆలోచించడం కూడా తెలివైన నిర్ణయం అనిపించుకోదని కేంద్ర మంత్రులు భావిస్తున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉందని గుర్తు చేస్తూ, శీతాకాల సమావేశాలకు తొందరేమీ లేదని, రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ ఆరు నెలల్లోగా ఓ మారు సమావేశమైతే సరిపోతుందని, దీని ప్రకారం, నేరుగా బడ్జెట్ సమావేశాలను జనవరి చివరి వారంలో ప్రారంభిస్తే సరిపోతుందని వారు అభిప్రాయపడ్డారు.

గత సెప్టెంబర్ లో వర్షాకాల సమావేశాలు జరుగుతున్న వేళ, పలువురు ఎంపీలు కరోనా బారిన పడటంతో ముందుగానే పార్లమెంట్ ను నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మొత్తం 17 మంది లోక్ సభ సభ్యులు, 8 మంది రాజ్యసభ సభ్యులకు వ్యాధి సోకింది. కొవిడ్ నిబంధనలను కచ్ఛితంగా పాటిస్తూ ఉన్నప్పటికీ పరిస్థితి విషమించింది. పార్లమెంట్ హాల్ లో భౌతికదూరం పాటిస్తూ ఉన్నా, రెగ్యులర్ గా ఆర్టీపీసీఆర్ టెస్ట్ జరుగుతున్నా కేసులు ఆగలేదు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించకూడదని కేంద్రం భావిస్తోంది.

More Telugu News