వర్క్‌ ఫ్రమ్ హోం ఉద్యోగుల్లో ‘జూమ్ డిస్మోర్ఫియా’

17-11-2020 Tue 06:59
  • ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులపై అమెరికాలో పరిశోధన
  • ముఖంలో లోపాలను చూసుకుని మానసికంగా ఇబ్బంది
  • శస్త్రచికిత్సలవైపు మొగ్గుచూపుతున్న వైనం
Zoom Dysmorphia leading people to rush for facial treatments

కరోనా మహమ్మారి కారణంగా వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగుల్లో ‘జూమ్ డిస్మోర్ఫియా’ అనే కొత్త రకం రుగ్మత పెరుగుతున్నట్టు తాజా పరిశోధనల్లో వెలుగుచూసింది. తమ శరీరంలో, లేదంటే ముఖంలో లోపాలు ఉంటే వాటిని చూసుకుని బాధపడుతూ ఆత్మవిశ్వాసం కోల్పోయి మానసికంగా ఇబ్బంది పడడాన్ని ‘డిస్మోర్ఫియా’ అంటారు. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగులు వీడియో సమావేశాల్లో పాల్గొంటున్నప్పుడు తమ ముఖంలో లోపాలు చూసుకుని మానసికంగా బాధపడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. తమలోని లోపాలను తిరిగి సరిచేసుకునేందుకు కొందరు శస్త్రచికిత్సలు కూడా చేయించుకుంటున్నట్టు తేలింది.

కరోనాకు ముందు ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లేవారు కాబట్టి తమ రూపురేఖల గురించి పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు ఇంటి నుంచి పనిచేస్తుండడంతో వీడియో సమావేశాల్లో పాల్గొనాల్సి వస్తోంది. ఫలితంగా తమ ముఖాన్ని చూసుకోవాల్సి వస్తుండడంతో అందులోని లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయట. ఫలితంగా వారిలో డిస్మోర్ఫియా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

దీంతో అందంగా కనిపించేందుకు చాలామంది ఉద్యోగులు శస్త్రచికిత్సలను ఆశ్రయిస్తున్నారు. ముఖంపై ఏర్పడిన ముడతలు, ముక్కును సరిచేయించుకుంటున్నారు. గూగుల్ సెర్చ్‌లో ‘అక్నే’, ‘హెయిర్‌లాస్’ వంటి పదాలను ఎక్కువగా సెర్చ్ చేస్తుండడం కూడా ‘జూమ్ డిస్మోర్ఫియా’ను రుజువు చేస్తోందని వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగులపై అధ్యయనం చేసిన అమెరికా పరిశోధకులు తెలిపారు.