అత్యంత దయనీయ పరిస్థితుల్లో సాయం కోరుతున్న తమిళ కమెడియన్

16-11-2020 Mon 22:07
  • క్యాన్సర్ తో బాధపడుతున్న నటుడు తావసి
  • గుర్తు పట్టలేనంతగా మారిపోయిన నటుడు
  • సాయం చేయాలంటూ విజ్ఞప్తి చేసిన కుమారుడు
Tamil comedian Thavasi seeks help

తమిళ చిత్రాల్లో కామెడీ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు తావసి ఇప్పుడు సాయం కోసం అర్థిస్తున్నాడు. ఆరోగ్యం బాగా క్షీణించిన దయనీయ పరిస్థితుల్లో ఎవరైనా దాతలు చేయూతనివ్వకపోతారా అని ఆశగా ఎదురుచూస్తున్నాడు. తావసి కొన్నాళ్ల కిందట క్యాన్సర్ బారినపడ్డాడు. దాంతో ఎంతో దృఢంగా ఉండే ఈ నటుడు కొన్నాళ్లలోనూ ఎముకలగూడులా మారిపోయాడు. ప్రత్యేకంగా చెబితే తప్ప అతడిని చూసినవాళ్లెవరూ తావసి అని గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. అతడి చికిత్స కోసం లక్షల్లో ఖర్చవుతున్న నేపథ్యంలో తావసి కుమారుడు అర్ముగం ఆదుకోవాలంటూ చిత్ర పరిశ్రమకు విజ్ఞప్తి చేశాడు.

శివకార్తికేయన్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'వరుత్తపడతా వాలిబర్ సంగం' అనే చిత్రంలో తావసి నటనకు మంచి మార్కులు పడ్డాయి. అనేక తమిళ చిత్రాల్లో పూజారి పాత్రలు, జ్యోతిష్యుల పాత్రలతో అలరించాడు. ఇప్పుడాయన ఆసుపత్రి బెడ్ పై దీనంగా ఉండడాన్ని అభిమానులు భరించలేకపోతున్నారు. ఆయనకు సాయం చేయాలంటూ తమిళ నడిగర్ సంఘం కూడా పిలుపునిచ్చింది.