బీహార్ సీఎంగా మళ్లీ గద్దెనెక్కిన నితీశ్ కుమార్ పై ప్రశాంత్ కిశోర్ వ్యంగ్యం

16-11-2020 Mon 21:17
  • బీహార్ సీఎంగా నితీశ్ ప్రమాణస్వీకారం
  • అలసిపోయిన నేత అంటూ సెటైర్ వేసిన ప్రశాంత్ కిశోర్
  • నాసిరకం పాలన భరించేందుకు బీహార్ సిద్ధంగా ఉండాలని పిలుపు  
Prashant Kishore satires on Bihar CM Nitish Kumar

బీహార్ సీఎంగా ఇవాళ జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ మాజీ నేత ప్రశాంత్ కిశోర్ వ్యంగ్యం ప్రదర్శించారు. అలసిపోయిన, రాజకీయపరంగా కుచించుకుపోయిన వ్యక్తి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారని, బీహార్ ప్రజలు మరికొన్నేళ్ల పాటు నాసిరకం పాలనను భరించేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు.

ఎన్నికల వ్యూహకర్తగా జాతీయస్థాయిలో పేరుతెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్ గతంలో జేడీయూ పార్టీకి ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. అయితే నితీశ్ తో పొసగక అసంతృప్తి గళం వినిపించారు. దాంతో నితీశ్ ఆయనను పార్టీ నుంచి సాగనంపారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ తన అక్కసు వెళ్లగక్కినట్టు అర్థమవుతోంది.