'నామినేటెడ్ ముఖ్యమంత్రి' అంటూ నితీశ్ కుమార్ కు తేజస్వి శుభాకాంక్షలు

16-11-2020 Mon 20:57
  • ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తారని ఆశిస్తున్నామని ట్వీట్
  • 19 లక్షల ఉద్యోగాల హామీని గుర్తు చేసిన తేజస్వి 
  • అన్ని సమస్యలను పరిష్కరిస్తారని భావిస్తున్నానని వ్యాఖ్య
Tejashwi Yadav calls Nitish Kumar as nominated CM

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీశ్ కుమార్ ఈ సాయంత్రం ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నితీశ్ కు ఆర్జేడీ నేత, మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ వ్యంగ్యంగా శుభాకాంక్షలు తెలిపారు.

సీఎంగా నామినేట్ అయిన గౌరవనీయులైన నితీశ్ కుమార్ కు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. అధికార ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి బదులుగా... బీహార్ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఎన్నికల సమయంలో ఎన్డీయే హామీ ఇచ్చిన విధంగా 19 లక్షల ఉద్యోగాలు, నీటి పారుదల సమస్యలు, విద్య వంటి సమస్యలను పరిష్కరిస్తారని భావిస్తున్నానని చెప్పారు.

బీహార్ ఎన్నికలలో ఆర్జేడీ అన్నిటికన్నా ఎక్కువ స్థానాలను సాధించింది. బీజేపీ రెండో స్థానంలో నిలవగా, జేడీయూ మూడో స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ పొత్తులో భాగంగా ఇచ్చిన హామీ మేరకు నితీశ్ నే సీఎం చేయాలని బీజేపీ నిర్ణయించింది. అయితే, కేవలం 40 సీట్లు వచ్చిన వ్యక్తిని సీఎం పీఠంపై ఎలా కూర్చోబెడతారని మహాకూటమిలోని పార్టీలన్నీ ప్రశ్నించాయి. ప్రజలు తిరస్కరించిన నితీశ్ ను మళ్లీ సీఎం ఎలా చేస్తారని ఎద్దేవా చేశాయి.