Nagaraju: కేటీఆర్ పేరుచెప్పి మోసాలకు పాల్పడుతున్న మాజీ క్రికెటర్ అరెస్ట్

  • తెలంగాణ పోలీసుల అదుపులో మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు
  • కేటీఆర్ పీఏనంటూ మోసాలు
  • గతంలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడిన నాగరాజు
Telangana police arrests former Andhra Ranji cricketer Nagaraju

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేరుచెప్పి మోసాలకు పాల్పడుతున్న ఆంధ్రా రంజీ జట్టు మాజీ క్రికెటర్ నాగరాజును తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. తాను మంత్రి కేటీఆర్ కు పీఏ నంటూ చెప్పుకుంటున్న నాగరాజు మోసాలు చేస్తుండడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతనిపై గతంలోనూ ఇదే తరహాలో కేసులు నమోదయ్యాయి.

బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ పేరు వాడుకుని మోసాలు చేసిన ఘటనలోనూ నాగరాజును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. తాను ఎమ్మెస్కే ప్రసాద్ నని చెప్పి ఓ వ్యక్తి నుంచి రూ.2.88 లక్షలు వసూలు చేశాడు. ఓ సొసైటీ నుంచి రూ.3.88 లక్షలు తీసుకున్నాడు. ఇలాంటివే ఎన్నో కేసులు నాగరాజుపై ఉన్నాయి.

నాగరాజు పూర్తిపేరు బుడమూరి నాగరాజు. వయసు 24 సంవత్సరాలు. సాధారణంగా అతని వయసులో ఉన్న క్రికెటర్లు టీమిండియాలో స్థానం కోసం కృషి చేస్తుంటారు. కానీ, దారితప్పిన నాగరాజు జల్సాలకు అలవాటు పడి మోసాలకు తెరలేపాడు. నాగరాజు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యవ్వారిపేట. ఎంబీయే వరకు చదువుకున్న నాగరాజు బాల్యం నుంచి క్రికెట్ లో ఎంతో ప్రతిభచూపేవాడు. 2006లో అండర్-14 విశాఖ జట్టుకు ఎంపికై సత్తా చాటాడు.

2014లో ఆంధ్రా రంజీ జట్టుకు ఎంపికై పలు మ్యాచ్ లు ఆడాడు. అంతేకాదు, 2016లో ఏకధాటిగా 82 గంటల పాటు బ్యాటింగ్ చేసి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నాడు. నాగరాజు టాలెంట్ చూసి అనేక ఎన్జీవోలు ఆర్థికసాయం చేసి ప్రోత్సహించేందుకు ముందుకొచ్చాయి. ఆ విధంగా చేతినిండా డబ్బు రావడంతో నాగరాజు పక్కదారి పట్టాడు. విలాసవంతమైన జీవితం కోసం అర్రులు చాచాడు. ధోనీ క్రికెట్ అకాడమీ పేరుతో ఓ శిక్షణ కేంద్రం స్థాపిస్తున్నట్టు చెప్పి పలువురికి టోపీ పెట్టాడు. ఈ విధంగా అనేక కేసులు అతడిపై ఉన్నాయి.

More Telugu News