మహిళ ఆత్మవిశ్వాసంతో ముందుకు వస్తే లక్ష్యాలను చేరుకుంటుంది: ఆసక్తికర వీడియో పంచుకున్న సైబరాబాద్ పోలీస్

16-11-2020 Mon 20:11
  • సామాజిక చైతన్యం దిశగా సైబరాబాద్ పోలీసుల ప్రయత్నం
  • ట్విట్టర్ లో ఆసక్తికరమైన పోస్టు
  • మహిళా క్రికెటర్ ఫీల్డింగ్ విన్యాసం వీడియో పంచుకున్న వైనం
Cyberabad police shares women spirit video

సైబరాబాద్ పోలీస్ విభాగం శాంతిభద్రతల పరిరక్షణ మాత్రమే కాదు సామాజిక చైతన్యం తీసుకువచ్చేందుకు కూడా తనవంతు కృషి చేస్తుంది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల ద్వారా సైబరాబాద్ పోలీసులు మార్పు తీసుకువచ్చేందుకు తమవంతు పాటుపడుతుంటారు. తాజాగా సైబరాబాద్ పోలీసులకు చెందిన ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ ట్విట్టర్ లో ఓ పోస్టు చేసింది. ఒక మహిళ ఆత్మవిశ్వాసంతో ముందుకు వస్తే ఆమె తన లక్ష్యాలను చేరుకుంటుంది అంటూ ప్రోత్సాహక వచనాలు పలికింది.

ఈ మేరకు ఇటీవల ముగిసిన ఉమెన్స్ టీ20 చాలెంజ్ లో థాయ్ లాండ్ అమ్మాయి నటాకన్ చాంటమ్ చేసిన అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసం తాలూకు వీడియోను కూడా పంచుకుంది. బౌండరీ లైన్ వద్దకు వెళుతున్న బంతిని నటాకన్ చాంటమ్ మెరుపులా డైవ్ చేసి ఆపిన తీరు ఈ వీడియోలో చూడొచ్చు. పురుష క్రికెటర్లు సైతం అచ్చెరువొందేలా బౌండరీ లైన్ వద్ద చాంటమ్ చేసిన ప్రయత్నం మహిళల శక్తిని చాటుతుందనడంలో సందేహం లేదు.