వర్ల రామయ్య వ్యాఖ్యలను ఖండించిన గుంటూరు రూరల్ ఎస్పీ

16-11-2020 Mon 19:42
  • రాజకీయాల్లోకి పోలీసులను లాగకండి
  • యలమందపై మద్యం కేసు ఉంది
  • అతన్ని కిడ్నాప్ చేయలేదు
Dont link police to politics says Guntur SP

గుంటూరు జిల్లా మాచర్ల ప్రాంతంలో పోలీసులు, రౌడీలు చేతులు కలిపి జగన్ ప్రభుత్వం కోసం పని చేస్తున్నారంటూ టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. యలమంద నాయక్ కుటుంబంపై జరిగిన దాడే దీనికి నిదర్శనమని అన్నారు. జగన్ పాలన అరాచకంగా, పాలెగాళ్ల పాలన మాదిరి ఉందని చెప్పారు.

సరస్వతి పవర్ ఇండస్ట్రీకి కేటాయించిన భూముల విషయంలో గతంలో తమకు అడ్డుగా వచ్చాడనే కోపంతో... జగన్ ప్రభుత్వం ఆయన కుటుంబంపై ఇప్పుడు అక్కసుతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అకారణంగా ఆయనను 10 రోజులు జైలుకు పంపిందని చెప్పారు. అర్ధరాత్రి అతని ఇంటికి వెళ్లిన పోలీసులు... అతని భార్యను పక్కకు తోసేసి, అతడిని కిడ్నాప్ చేశారని విమర్శించారు.

మరోవైపు వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలను గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ఖండించారు. రాజకీయాల్లోకి పోలీసులను లాగొద్దని అన్నారు. యలమంద నాయక్ పై మద్యం కేసు ఉన్నందువల్లే అరెస్ట్ చేశామని చెప్పారు. అతన్ని కిడ్నాప్ చేయలేదని... అరెస్ట్ చేసి, జడ్జి ఎదుట హాజరుపరిచామని తెలిపారు.