వేధింపులకు గురైన కుటుంబంలో మతాన్ని చూస్తారా?: సోము వీర్రాజుపై పయ్యావుల మండిపాటు

16-11-2020 Mon 18:14
  • నంద్యాల ఉదంతంలో సోము వ్యాఖ్యలు
  • పోలీసులను అరెస్ట్ చేయడం దారుణమన్న సోము
  • చంద్రబాబు ముస్లింలను రెచ్చగొడుతున్నారని ఆరోపణ
  • వీర్రాజు వ్యాఖ్యలు అమానవీయమన్న పయ్యావుల
TDP leader Payyavula Keshav strongly condemns Somu Veerraju comments

నంద్యాల ఆత్మహత్యల కేసులో ముస్లింలను రెచ్చగొడుతూ చంద్రబాబు ఓట్ల రాజకీయం చేస్తున్నారని, ఈ కేసులో పోలీసులను అరెస్ట్ చేయడం దారుణమని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ స్పందించారు. నంద్యాల ఆటోడ్రైవర్ అబ్దుల్ సలాం మృతిపై సోము వీర్రాజు వ్యాఖ్యలు అమానవీయం అని వ్యాఖ్యానించారు. వేధింపులకు గురైన కుటుంబంలో మతాన్ని చూస్తారా? అంటూ ప్రశ్నించారు. బాధితుల రక్తపు మరకలపై రాజకీయ కోణాన్ని ప్రజలు సమర్థించరని స్పష్టం చేశారు.

ఈ వ్యవహారంలో వ్యాఖ్యల ద్వారా వీర్రాజు తన స్థాయిని మరింత దిగజార్చుకున్నారని పయ్యావుల విమర్శించారు. రాష్ట్రంలో ఇలాంటి రాజకీయ పోకడలు ఎన్నడూ చూడలేదని, వీర్రాజు వ్యాఖ్యలు వ్యక్తిగతమా? లేక బీజేపీ విధానమా? అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.