ఒకప్పుడు సిద్ధాంతాల పార్టీగా ఉన్న బీజేపీ... ఇప్పుడు చిల్లర పార్టీగా మారింది: హరీశ్ రావు

16-11-2020 Mon 17:49
  • ఓట్ల కోసం బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోంది
  • ఇంటిపన్నులో 50 శాతం మినహాయింపును టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది
  • బీజేపీ, కాంగ్రెస్ ల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి
BJP is doing vote politics says Harish Rao

బీజేపీపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. సిద్ధాంతాలు కలిగిన పార్టీగా గతంలో ఉన్న బీజేపీ... ఇప్పుడు చిల్లర పార్టీగా మారిపోయిందని విమర్శించారు. ఓట్ల కోసం చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు పటాన్ చెరులో బూత్ స్థాయి టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో హరీశ్ మాట్లాడుతూ ఈ మేరకు విమర్శలు గుప్పించారు.

కరోనా కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఇంటి పన్నులో 50 శాతం మినహాయింపును టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని హరీశ్ రావు తెలిపారు. హైదరాబాదు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను ప్రతి గడపకు వెళ్లి చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. ఇదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను కూడా తిప్పికొట్టాలని అన్నారు.

పటాన్ చెరు వంటి పారిశ్రామిక ప్రాంతంలో 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని హరీశ్ చెప్పారు. కాంగ్రెస్ హయాంలో పవర్ హాలిడే కారణంగా పరిశ్రమలు మూతపడ్డాయని విమర్శించారు. పటాన్ చెరు, ఆర్సీపురంలలో కొత్తగా మార్కెట్లను ఏర్పాటు చేశామని, మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్లను నిర్మించామని చెప్పారు. స్థానిక యువత ఉపాధి కోసం మెడికల్, ఐటీ సంస్థలను నెలకొల్పామని తెలిపారు. పటాన్ చెరు ప్రాంతంలో నిర్మించిన 40 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 10 శాతం ఇళ్లను స్థానికులకు ఇస్తామని చెప్పారు.