ఏపీ కరోనా అప్ డేట్: అనంతపురంలో సింగిల్ డిజిట్ కు దిగొచ్చిన కరోనా కేసులు

16-11-2020 Mon 17:39
  • అనంతపురం జిల్లాలో 4 కేసులు వెల్లడి
  • ఇతర జిల్లాల్లోనూ బాగా తగ్గిన కరోనా ప్రభావం
  • గత 24 గంటల్లో ఏపీలో 753 పాజిటివ్ కేసులు
Ananatpur district registered corona cases in single digit after a long time

ఏపీలో కరోనా మహమ్మారి ప్రభావం గణనీయంగా తగ్గుతోంది. తాజాగా విడుదల చేసిన బులెటిన్ లో గణాంకాలు ఊరట కలిగిస్తున్నాయి. గత 24 గంటల్లో 43,044 కరోనా టెస్టులు చేయగా, 753 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో  అత్యధికంగా 216 కొత్త కేసులు వెల్లడయ్యాయి. ఇక, అనేక జిల్లాల్లో కరోనా నామమాత్రంగా ఉనికి చాటుకుంది.

అనంతపురం జిల్లాలో 4 పాజిటివ్ కేసులు మాత్రమే రాగా, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 12 కేసుల చొప్పున వచ్చాయి. ఇవేకాకుండా అనేక జిల్లాల్లో కరోనా కేసులు రెండంకెల సంఖ్యకు పడిపోయాయి. అదే సమయంలో రాష్ట్రంలో కరోనాతో 13 మంది మరణించారు. 1,507 మంది కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు మొత్తం 8,54,764 పాజిటివ్ కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 17,892 మాత్రమే. 8,29,991 మంది కరోనా ప్రభావం నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. అటు, మొత్తం మరణాల సంఖ్య 6,881కి పెరిగింది.